Vijayawada Floods : విజయవాడ నగరం ఇంకా తేరుకోలేదు. మరణించిన వారి లెక్కలు మారుతున్నాయి. ప్రభుత్వం చెబుతున్న సంఖ్య కంటే ఎక్కువగా ఉంది. వరద నీరు తగ్గుతున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. గంటల వ్యవధిలోనే పదుల సంఖ్యలో మృత దేహాలు వెలుగులోకి వస్తున్నాయి. వరద కారణంగా బయటపడలేని వారు ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు. కానీ ఎంతమంది మృతి చెందారు అన్నది తెలియాల్సి ఉంది. తమ వారిని కోల్పోయిన బంధువులు విషాదంలో మునిగిపోతున్నారు. నగరంలో వరద క్రమేపి తగ్గుతోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటివరకు 32 మంది మృతి చెందినట్లు ప్రకటించారు. కానీ అనేకమంది వరద నుండి బయటపడలేక మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వరద తగ్గుముఖం పడుతుండడంతో మృతదేహాలు బయటపడుతున్నాయి. వాటిని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. అదే సమయంలో ఆచూకీ గల్లంతయిన వారు శవాలుగా తేలుతున్నారు. చిట్టి నగర్ ప్రాంతానికి చెందిన 14 సంవత్సరాల బాలుడు గల్లంతయ్యాడు. వరద తగ్గడంతో శవమై తేలాడు. అతి కష్టం మీద ఆ బాలుడి మృతదేహాన్ని చెక్కబల్లపై తీసుకెళ్తుండడం హృదయ విదారకంగా కనిపిస్తోంది. అందరి హృదయాలను కలచి వేసింది. కుటుంబ సభ్యులు కన్నీటి రోదనతో తరలిస్తున్న తీరు వర్ణించలేనిది. అంతటి వేదనలో గుండెలవిసేలా బాధలో వారు మృతదేహాన్ని తరలిస్తున్నారు. మరోవైపు చిన్నారులను, వృద్ధులను అతి కష్టం మీద తరలిస్తుండడం కనిపిస్తోంది.
* సింగ్ నగర్ ప్రాంతం అతలాకుతలం
వరద నీటితో సింగ్ నగర్ ప్రాంతం భారీగా నష్టపోయింది. అక్కడ సహాయ చర్యలు కొనసాగుతున్న ఇంకా చాలా కాలనీలు వరద ముంపులోనే ఉన్నాయి. వారికి పునరావాస చర్యలు కూడా ఆలస్యం అవుతున్నాయి. ఆహార పంపిణీలో జాప్యం జరుగుతోంది. నీరు, పాలు, ఆహారం అందడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెలిక్యాప్టర్లు, డ్రోన్ కెమెరాలు చూసి పరుగులు పెడుతున్నారు. అనారోగ్యాలతో బాధపడుతున్న వారి బాధ వర్ణనాతీతం.
* దీర్ఘకాలిక రోగులకు ఇబ్బందులు
అయితే చాలామంది దీర్ఘకాలిక రోగులు ప్రాణాలు వదులుతున్నారు. మరికొందరు వరద నీటిలో గల్లంతయ్యారు. వారంతా సురక్షితమని భావిస్తున్న క్రమంలో వారి మృతదేహాలు బయటపడుతుండడంతో విషాదం నెలకొంది. కనీసం మృతదేహాలను అంత్యక్రియలు నిర్వహించేందుకు అవసరమైన బంధువులు కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది. ఇలా గుర్తించిన మృతదేహాలను అధికారులు వారి బంధువులకు అప్పగిస్తున్నారు. వరద తగ్గే కొలది ఈ మృతదేహాలు వెలుగులోకి వస్తుండడం విశేషం.
* నాలుగు రోజులుగా నిరాశ్రయులు
గత నాలుగు రోజులుగా విద్యుత్ సరఫరా లేదు. ఇంట్లో నిత్యవసర సరుకులు లేవు. ఆహారం తినకుండా ఉన్నవారు వేళల్లో ఉన్నారు. ఇంకా చాలా ప్రాంతాలు ముంపు బారిన ఉన్నాయి. మరోవైపు బుడమేరులో గండి పడిందని వార్తలు బాధితుల్లో టెన్షన్ పెంచుతున్నాయి. మరోవైపు వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. అంటూ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది. ముంపు ప్రాంతాల్లో శానిటేషన్ పనులు ప్రారంభమైనా ప్రజల్లో మాత్రం ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. మొత్తానికైతే ఇప్పటివరకు ప్రాణ నష్టం లేదని భావించినా.. భారీగా మృతదేహాలు వెలుగు చూస్తుండడంతో.. మున్ముందు ఎన్ని బయటపడతాయోనని ఆందోళన మాత్రం వ్యక్తమవుతోంది.
విజయవాడలో కన్నీటి దృశ్యాలు
చిట్టినగర్ పరిధిలో అదృశ్యమైన 14 ఏళ్ల బాలుడు వరద నీటిలో శవమై తేలాడు. నడుములోతు నీటిలో మృతదేహాన్ని తీసుకెళ్తున్న కుటుంబసభ్యులు. కొడుకుని తరలిస్తుండగా తల్లి రోదిస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. pic.twitter.com/GssjqLCk2F
— Telugu Scribe (@TeluguScribe) September 5, 2024