Bigg Boss 6 Aarohi Rao: బిగ్ బాస్ తెలుగు 6లో పాల్గొన్న ప్రతి కంటెస్టెంట్ జీవితంలో ఎన్నో మలుపులు, కష్టాలు, సవాళ్లు. అందరి జీవితం పూల పాన్పు కాదని చెప్పే నిజాలు. అలాంటి ఒడిదుడుకుల జీవితం ఎదుర్కొన్న వారిలో ఆరోహి రావ్ ఒకరు. వరల్డ్ బిగ్గెస్ట్ షో బిగ్ బాస్ షోలో పాల్గొనే ఛాన్స్ కొట్టేసిన ఆమె జర్నీ చాలా మందికి స్ఫూర్తి దాయకం. ఎవరి మద్దతు లేకుండా అసలు ఈ లోకం ఏమిటో తెలియని ఓ పల్లెటూరి అమ్మాయి ఇక్కడి వరకు రావడం గొప్ప విషయం. 20వ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆరోహి రావ్ జీవితంలో తాను పడిన కష్టాలు ప్రేక్షకులకు వివరించారు.

అనారోగ్యంతో తల్లి చనిపోయింది. అండగా ఉండాల్సిన తండ్రి వేరే మహిళను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు. దిక్కుతోచని స్థితిలో ఏదో సాధించాలని హైదరాబాద్ వస్తే, అడుగడుగునా ఇబ్బందులు, వేధింపులు. వయసులో ఉన్న ఆడపిల్లను సమాజం ఎలా చూస్తుందో అర్థం చేసుకున్నాను. సాయం అడిగితే నాకేంటి అన్నట్లు చూసే చూపులు. అవకాశం దొరికితే కబళించాలని చూసే కామాంధులు. ఇలాంటి ప్రపంచంలో బ్రతకాలంటే అమాయకంగా ఉంటే కుదరదు. మనల్ని మనం మార్చుకోవాలి. అందుకే కట్టు బొట్టు మార్చేశాను. అంజలి పేరును ఆరోహి గా మార్చేశాను. ఈ ప్రపంచంలో బ్రతకడానికి నేను ఇచ్చుకున్న కొత్త రూపం ఇది.
ఆరోహిగా మారాక చాలా నేర్చుకున్నాను. రాటు తేలాను, అని ఆరోహి బిగ్ బాస్ ఇంట్రో వీడియోలో చెప్పుకొచ్చింది. పల్లెటూరి అంజలి కాస్త ఆరోహిగా మారిన తన ప్రయాణం ప్రేక్షకులకు ఆసక్తి కలిగించింది. ఇక ఆడియన్స్ కి పక్కా ఎంటర్టైన్మెంట్ పంచుతానన్న ఆరోహి రావ్, చాలా కాన్ఫిడెంట్ గా కనిపించారు. కంటెస్టెంట్స్ లో చాలామంది సెలెబ్రిటీలు ఉంటారు. వాళ్లకు ఇప్పటికే మంచి ఫాలోయింగ్ ఉంటుంది. నేను ఎవరికీ తెలియను. కానీ నా ఆట తీరుతో గుర్తింపు తెచ్చుకుంటాను. అభిమానులను సంపాదించుకుంటానని ఆరోహి వెల్లడించారు.

ఇక చివర్లో నాగార్జున సెనోరీటాను కార్డ్స్ తెమ్మన్నారు. వాటిలో ఆరోహి ఒకటి ఎంచుకున్నారు. ఆమె ఎంచుకున్న కార్డు వెనుక బ్లాక్ హార్ట్ ఉంది. దాని అర్థం ఏమిటో తర్వాత చెప్తానన్న నాగార్జున, ఆరోహిని హౌస్ లోకి సాదరంగా సాగనంపారు. ఎమోషనల్ గా ఆడియన్స్ కి కనెక్ట్ అయిన ఆరోహి రావ్ హౌస్ లో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. ఇక ఈ సీజన్ కి గానూ హౌస్ లోకి 21 మంది ఎంట్రీ ఇచ్చారు. వీరిలో చలాకీ చంటి, బాల ఆదిత్య, సింగర్ రేవంత్ టాప్ సెలెబ్రిటీలు ఉన్నారు.