Sai Pallavi Role In Puspha 2: పుష్ప 2 చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ భారీగా ప్లాన్ చేస్తున్నాడు. లేటైనా పర్లేదు సినిమా గ్రాండ్ గా ఉండాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ కారణంగానే చాలా కాలం క్రితమే మొదలు కావాల్సిన పుష్ప సీక్వెల్ షూటింగ్ ఆలస్యమైంది. లొకేషన్స్, క్యాస్టింగ్, బడ్జెట్, టెక్నికల్ టీం… ఇలా ప్రతి విషయంలో శ్రద్ధ చూపిస్తున్నారు. స్క్రిప్ట్ లో సైతం పలు మార్పులు చేసినట్లు వార్తలు వచ్చాయి. తన రైటింగ్ టీం తో చాలా కాలంగా పుష్ప 2 స్క్రిప్ట్ పై సుకుమార్ కసరత్తు చేస్తున్నారు.

పుష్ప సీక్వెల్ లో సుకుమార్ ఇద్దరు టాలెంటెడ్ ఆర్టిస్ట్స్ ని తీసుకుంటున్నట్లు కొన్నాళ్లుగా వరుస కథనాలు వెలువడుతున్నాయి. వారిలో ఒకరు విజయ్ సేతుపతి కాగా, మరొకరు సాయి పల్లవి. విజయ్ సేతుపతి విలన్ రోల్ చేస్తున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే ఆయన విలన్ కాదు, కథలో కీలకమైన పాజిటివ్ రోల్ అంటున్నారు. అంతకు మించి ఆసక్తి రేపుతున్న న్యూస్ సాయి పల్లవి ఎంట్రీ. పుష్ప 2 లో సాయి పల్లవి నటిస్తున్న మాట వాస్తవమేనని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలో ఆమె రోల్ గురించి ఆసక్తికర విషయాలు బయటికొస్తున్నాయి.

పుష్ప పార్ట్ 1 మాదిరి పార్ట్ 2 కూడా అధిక భాగం అరణ్య నేపథ్యంలో సాగుతుంది. తిరుగులేని ఎర్ర చందనం స్మగ్లర్ గా అల్లు అర్జున్ కనిపించనున్నారు. కాగా పుష్ప 2 లో సాయి పల్లవి అడవి జాతికి చెందిన అమ్మాయిగా కనిపిస్తారట. అలాగే అల్లు అర్జున్ తో ఆమెకు చిన్న లవ్ ట్రాక్ కూడా ఉంటుందట. పాత్ర నిడివి పెద్దగా లేకున్నా చాలా ఇంట్రెస్టింగ్ గా సాయి పల్లవి పాత్రను సుకుమార్ డిజైన్ చేసినట్లు సమాచారం. మరి ఇదే నిజమైతే సాయి పల్లవి అభిమానులతో పాటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పండగే. బెస్ట్ డాన్సర్స్ అయిన బన్నీ, సాయి పల్లవితో డ్యూయట్ ప్లాన్ చేస్తే థియేటర్స్ లో పూనకాలే.
ఆల్రెడీ రష్మిక మందాన పుష్ప 2 హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. స్క్రిప్ట్ లో మార్పులు చేశాక ఆమె పాత్ర నిడివి తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఆమె పాత్ర చనిపోతుందనే పుకారు కూడా ఉంది. పుష్ప 2 బ్లాక్ బస్టర్ కెజిఎఫ్ 2 కి దగ్గరగా ఉంటుందనే వార్తలను సుకుమార్ ఖండించారు. ఇక ఇటీవలే అధికారికంగా పుష్ప 2 పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. త్వరలో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. పుష్ప పార్ట్ 1 వరల్డ్ వైడ్ రూ. 360 కోట్ల గ్రాస్ వసూలు చేసిన విషయం తెలిసిందే.