Bharat Ratna To NTR: ఈ రోజు మహానటుడు, మహానేత ఉదయించిన గొప్ప రోజు. తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా, ఆరాధ్య దైవంగా నిలచిపోయిన మహానుభావుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు నేడు. జాతీయస్థాయిలో తెలుగువారికి గుర్తింపు తెచ్చి, మన ఆత్మగౌరవాన్ని పెంచిన విశ్వ విఖ్యాత నట సార్వభౌముడికి పాదభివందనాలు చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలుగుజాతి వాడిని, వేడిని, పౌరుషాన్ని, తెగువని ప్రపంచపు నలుమూలలా చాటిచెప్పి.. కులం, మతం, ప్రాంతం, అలాగే రాజకీయ పార్టీలకు అతీతంగా అభిమానుల్ని సంపాదించుకున్న ఘనత ఒక్క ‘ఎన్.టి.ఆర్’కు మాత్రమే సాధ్యం అయింది. ఐతే ఆయన్ని ‘భారతరత్న’ బిరుదాంకితుడిగా చూడాలన్న తెలుగువాళ్ళ చిరకాల స్వప్నం సాకారం అయ్యేది ఎప్పుడు ?
Also Read: Gadapa Gadapaki YSRCP: మోగని సామాజిక న్యాయభేరి.. ముఖం చాటేస్తున్న ప్రజలు
‘ఎన్టీఆర్ కి భారతరత్న’ అనే అంశం తెర మీదకు ఏడాదికి ఒక్కసారి వస్తూనే ఉంది. ప్రతి ఏటా ఎన్టీఆర్ అభిమానుల్లో, కొన్ని మీడియా వర్గాల్లో ఈ అంశం పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఏడాది ఇలా గడచిపోతూనే ఉంది. గత ఇరవై ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి. ఈ విషయంలో తెలుగు రాజకీయ నేతల నిర్లక్ష్యమే ఎక్కువగా కనిపిస్తుంది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎన్టీఆర్ కి భారతరత్న సాధించలేకపోయారు. బాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉండి ఉంటే.. ఎన్టీఆర్ కి ఎప్పుడో భారతరత్న వచ్చి ఉండేది. ఎన్టీఆర్ పై తమకు మాత్రమే గౌరవం ఉందని ప్రజల్లో చెప్పుకోవడానికి చంద్రబాబు పరిమితం అయ్యారు.
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి పని చేశారు. ఆమె కూడా ‘ఎన్టీఆర్ కి భారత రత్న’ ఇవ్వాలని పూర్తి స్థాయిలో ఎప్పుడూ ప్రయత్నాలు చేయలేదు. మేము కూడా ఎన్టీఆర్ అభిమానులమే అని చెప్పుకున్న రాజశేఖర్, కిరణ్ కుమార్ రెడ్డిలు కూడా భారతరత్న విషయంలో పెద్దగా చేసిన కృషి ఏమి లేదు. తెలుగు రాజకీయాలను ప్రభావితం చేసి.. తెలుగు నెలకు గౌరవం తెచ్చిన ఆ మహానేతకు, నిజమైన గౌరవం దక్కేది ఎప్పుడు ? పార్లమెంట్ లో ఎన్టీఆర్ విగ్రహం.. భారతరత్న డిమాండ్లన్నీ నీటిపై రాతలేనా ? మళ్లీ.. ఈ అంశం ప్రస్తావనకు వచ్చేది మరుసటి ఏడాదేనా ? నేటి రాజకీయాలు చూసి ఎన్టీఆర్ ఆత్మ కూడా ఘోషిస్తోందేమో. ఎన్టీఆర్ ఆత్మ శాంతించేది ఎప్పుడు? ఆయనకు భారతరత్న వచ్చేది ఎప్పుడు ? ప్రతి తెలుగు వాడు ప్రశ్నించుకోవలసిన ప్రశ్న ఇది.
Also Read: NTR 99th Jayanthi: తెలుగు చరిత్రలో యుగపురుషుడు ఎన్టీఆర్.. నేడు ఆయన 99వ జయంతి