BarBarik Director Emotional Video: సినీ ఇండస్ట్రీ లో సక్సెస్ అవ్వడమంటే సాధారణమైన విషయం కాదు. నిర్మాతలు జూద క్రీడా లాంటి ఈ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాలంటే వందల కోట్ల ఆస్తులు ఉండాలి. లేదంటే నాశనం అయిపోవాల్సిందే. ఎంతోమంది పాపం అఘాయిత్యం చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని కొన్ని సార్లు మంచి సినిమాలు తీసినప్పటికీ కూడా ఆడియన్స్ కి రీచ్ అవ్వడం లో విఫలం అవుతుంటాయి. ఎందుకంటే హైప్ లేకపోవడం వల్ల అని చెప్పొచ్చు. ఆడియన్స్ కి చేరుకోవాలంటే ఆకర్షణీయంగా థియేట్రికల్ ట్రైలర్, లేదా ఒక బ్లాక్ బస్టర్ పాట కానీ ఉండాలి. అప్పుడే థియేటర్స్ కి కదులుతారు. ఎవరు అవునన్నా, కాదన్నా ఇది కాదు అనలేని నిజం. రీసెంట్ గా డైరెక్టర్ మోహన్ శ్రీవాస్తవ ‘బార్బరిక్’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. విడుదలకు ముందు ఈ సినిమా ప్రొమోషన్స్ ని చాలా గట్టిగానే చేసాడు. సోషల్ మీడియా మరియు టీవీ ఎంటర్టైన్మెంట్ షోస్ లో కూడా తన సినిమాని ప్రమోట్ చేసుకున్నాడు.
సత్యరాజ్, సత్యం రాజేష్, ఉదయ భాను లాంటి ప్రముఖ నటీనటులు ఈ చిత్రం లో నటించగా, ప్రముఖ డైరెక్టర్ మారుతీ ఈ చిత్రాన్ని సమర్పించాడు. థియేట్రికల్ ట్రైలర్ కూడా పర్వాలేదు అనే రేంజ్ లో ఆసక్తికరంగా ఉంది. సినిమా కి కనీస స్థాయి ఓపెనింగ్స్ ని రప్పించగల తారాగణం ఈ చిత్రం లో ఉన్నది. అయినప్పటికీ కూడా ఓపెనింగ్ వసూళ్లు రాలేదు. నిన్న (ఆదివారం) ఆ చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవాస్తవ ఒక థియేటర్ కి వెళ్లి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో చూడమని అనుకొని వెళ్ళాడు. తీరా ఆ థియేటర్ లో చూస్తే కేవలం పది మంది ప్రేక్షకులు మాత్రమే ఉన్నారు. వాళ్ళని సినిమా ఎలా ఉందని అడగ్గా, చాలా బాగుందని చెప్పారు. సినిమా బాగుందని ఇంతమంది చెప్తున్నప్పటికీ కూడా జనాలు థియేటర్ కి రావడం లేదని పాపం డైరెక్టర్ తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేసాడు.
ఆయన మాట్లాడుతూ ‘ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడడానికి బార్బరిక్ ఆడుతున్న ఈ థియేటర్ లోకి రావడం జరిగింది. థియేటర్ లోపల కేవలం 10 మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళని సినిమా ఎలా ఉందని అడిగితే బాగుందని చెప్పారు,కానీ ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రాన్ని చూసేందుకు థియేటర్స్ కి రావడం లేదు. ఈ చిత్రం కోసం అన్ని వదిలేసి రెండున్నర సంవత్సరాలు కష్టపడ్డాను. ఇప్పుడు నా మానసిక పరిస్థితిని నా భార్య చూసి నేను ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటానో అని భయపడుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు మోహన్ శ్రీవాస్తవ. అనంతరం ఏడుస్తూ తన చెప్పులను తీసి కొట్టుకున్నాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. మోహన్ శ్రీవాస్తవ పరిస్థితి ని చూసి నెటిజెన్స్ జాలి చూపిస్తున్నారు.
టాలీవుడ్లో చిన్న సినిమాలకు అసలు ఆధారం లేదని ప్రేక్షకులు ఎవరు చూడడానికి థియేటర్లు రావడంలేదని ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది. రాజమౌళి సందీప్ రెడ్డి వంగ లాంటి పెద్ద డైరెక్టర్లు తీస్తున్న హిట్ సినిమాలు మాత్రమే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. చిన్న సినిమాలు మంచి కథాంశతో వచ్చే సినిమాలు బాగున్నా కూడా జనాలు డబ్బులు పెట్టి థియేటర్లో చూడడానికి అసలు ఇష్టపడడం లేదు. ఈ దృక్పథం టాలీవుడ్లో కొత్త సినిమాలు చూసేవారికి క్రియేటివ్ గా తీసే వారికి శరాఘాతం గా మారింది. చిన్న సినిమా దర్శకులు నిర్మాతలు నట్టేట ముంచి ఆత్మహత్యకు పురిగొలుపుతోంది. ఈ పరిస్థితి మారినప్పుడే టాలీవుడ్ బాగుపడుతుంది.
