Balakrishna Fans In Charlotte: అభిమానుల సందడితో మార్మోగిన థియేటర్ పరిసరాలు
అమెరికాలోని చార్లెట్ నగరంలో ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకున్నారు.

తెలుగు సినీ పరిశ్రమలో ఐదు దశాబ్దాలుగా తనదైన నటన, పవర్‌ఫుల్ డైలాగులతో ప్రేక్షకులను అలరిస్తున్న బాలకృష్ణ నేటికీ అదే ఉత్సాహంతో వరుస విజయాలను అందుకుంటున్నారని అభిమానులు పేర్కొన్నారు. ముఖ్యంగా Akhanda చిత్రం ద్వారా ప్రారంభమైన ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మరింత విజయవంతమై, వరుసగా వంద కోట్ల క్లబ్ చిత్రాలతో మూడు తరాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారని కొనియాడారు.

బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా ప్రదర్శించిన Samarasimha Reddy చిత్రాన్ని అభిమానులు పెద్ద ఎత్తున వీక్షించారు. థియేటర్ వద్ద నినాదాలు చేస్తూ, సంబరాలు నిర్వహిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఛార్లెట్ ప్రాంతానికి చెందిన బాలకృష్ణ అభిమానులతో పాటు తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి.

