Super Star Krishna- NTR: నటశేఖర కృష్ణ మరణం సినీ రంగాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. దాదాపు మూడు దశాబ్దాల పాటు సినీ రంగాన్ని ఏలిన ఆయన జీవితంలో ఎన్నో విశేషాలు, విషాదాలు చోటు చేసుకున్నాయి. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, పద్మాలయ స్టూడియో అధినేతగా చిత్ర పరిశ్రమకు అనేక సేవలు చేశారు. ఇటు సినీరంగంలోనే కాకుండా రాజకీయంగా తనదైన ముద్ర వేశారు. అంతేకాకుండా నాటి రాజకీయ ఉద్దండుడు ఎన్టీఆర్ ను ఢీకొని ఆయన పార్టీ మీద గెలిచారు. అంతేకాకుండా ఆయన చేసిన కొన్ని సినిమాలు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయని చర్చ కూడా సాగింది. ఓసారి ఆయన ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఆయనపై రాళ్లదాడి జరిగింది. ఈ క్రమంలో కంటికి తీవ్ర గాయమైంది.

తెలుగు ఇండస్ట్రీకి ఇప్పటికీ దిగ్గజాలు ఎవరంటే.. ఎన్టీఆర్, ఏఎన్నార్ పేరు చెబుతారు. అలాంటి మహామహులు ఢీ కొనడానికి ఎవరూ సాహసించలేదు. కానీ కృష్ణ వారికి పోటీగా అనేక సినిమాల్లో నటించారు. వారితో సమానంగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఈ పోటీ సినిమా వరకు మాత్రమే ఉండేది. రియల్ లైఫ్ కొస్తే కృష్ణ అందరినీ కలుపుకుపోయే వారు. చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ సరైన వాతావరణం ఉండేలా చూసుకునేవారు. ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా కృష్ణ ఏమాత్రం ఆలోచించకుండా సాయం చేసేవారని చెప్పుకుంటున్నారు.
సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి చాలా మంది వెళ్లిన విషయం తెలిసిందే. ఈ కోవలో కృష్ణ కూడా ఉన్నారు. నాటి సీనియర్ నటుడు తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రభంజనం సృష్టిస్తున్న సమయంలో ఆయన పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని రాష్ట్రమంతటా తిరిగి ప్రజల్లోకి వెళ్లేవారు. కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడంలో కృష్ణ తనదైన ముద్ర వేశారు. ఈ క్రమంలో పార్టీని చేసిన కృషికి అతనికి ఏలూరు ఎంపీ టికెట్ కేటాయించింది.

1989లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పై కృష్ణ విజయం సాధించారు. అయితే 1989 నుంచి 1991 వరకు మాత్రమే కృష్ణ ఎంపీగా కొనసాగారు. ఈ సమయంలో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో తన సమీప అభ్యర్థి బోళ్ల బుల్లి రామయ్య చేతిలో ఓటమి చెందారు. ఎంపీగా ఉన్న సమయంలో కృష్ణ పార్లమెంట్ కమిటీల్లో చురుగ్గా వ్యవహరించే వారు. కన్సల్టేటివ్ కమిటీలోను, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిత్వ శాఖలో కీలకంగా కొనసాగారు.
అయితే ఎంపీగా ఓటమి చెందిన తరువాత క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కేవలం సినిమాలకే పరిమితమై ప్రజలకు వినోదాన్ని అందించారు. అయితే ఓసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేస్తుండగా తెలుగుదేశం అభిమానులు ఆయనపై రాళ్లదాడి చేశారు. ఈ సమయంలో కృష్ణ కంటికి గాయమైంది. అదృష్టవశాత్తూ ఆ ప్రమాదం నుంచి ఆయన తప్పించుకున్నారు.