Jagapathibabu : జగపతిబాబు ఆర్థికంగా ఉన్నతమైన కుటుంబంలో పుట్టారు. ఆయన తండ్రి వీబీ రాజేంద్రప్రసాద్ దర్శక నిర్మాత. పలు బ్లాక్ బస్టర్ చిత్రాలు తెలుగు పరిశ్రమకు అందించారు. కొడుకును హీరోగా పరిచయం చేశాడు. కెరీర్ బిగినింగ్ లో స్ట్రగుల్ అయిన జగపతిబాబు మెల్లగా నిలదొక్కుకున్నాడు. ఫ్యామిలీ చిత్రాల హీరోగా సెటిల్ అయ్యాడు. ఆయన చిత్రాలను ఆడియన్స్ కుటుంబ సమేతంగా చూసేవారు. అప్పుడప్పుడు మాస్ కమర్షియల్ సబ్జెక్ట్స్ తో పాటు, ప్రయోగాత్మక చిత్రాలు కూడా చేశారు.
ఒక దశకు వచ్చాక జగపతిబాబు చిత్రాలకు ఆదరణ కరువైంది. ప్రేక్షకులు ఆయన చిత్రాలను పట్టించుకోవడం మానేశారు. దానికి తోడు ఆర్థిక సమస్యలు తలెత్తాయి. డబ్బుల కోసం తన వద్దకు వచ్చిన ప్రతి సినిమా చేశాడు. దాంతో మార్కెట్ మరింత దెబ్బతింది. ఆఫర్స్ ఆగిపోయాయి. కోట్ల రూపాయల ఆస్తి వివిధ కారణాలతో కరిగిపోయింది. తాను ఎంతో ఇష్టపడి కట్టించుకున్న ఇల్లు అమ్ముకున్నాడు.
అయితే ఇల్లు అమ్ముకున్నా కూడా తానేమి బాధపడలేదట. ఇల్లు, కార్లు వంటి భౌతిక అంశాల మీద ప్రేమ పెంచుకోకూడదు. వాటి గురించి బ్రతికితే అది జీవితమే కాదని అనుకున్నాడట. తన కుటుంబ సభ్యులు కూడా ఇల్లు ఎందుకు అమ్మావని ప్రశ్నించలేదట. తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక స్నేహితుడు మాత్రం ఆదుకునే ప్రయత్నం చేశాడట. ఆయన ఎవరో కాదు హీరో అర్జున్ అట.
అర్జున్ సర్జా-జగపతిబాబు మంచి మిత్రులు. కలిసి చిత్రాలు చేశారు. తన ఫార్మ్ హౌస్ అమ్మి జగపతిబాబు అప్పులు చెల్లిస్తానని అన్నాడట. అయితే జగపతిబాబు అందుకు ఒప్పుకోలేదట. ఆ ఛాన్స్ తాను తీసుకోలేదట. ఎవరి బాధలు వారికి ఉంటాయి. మనం ఎవరినీ తప్పుబట్టడానికి వీల్లేదు. అర్జున్ మాత్రం తన పొలం అమ్మి ఆర్థిక సహాయం చేస్తానని అన్నాడని, జగపతిబాబు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అనంతరం విలన్ అవతారం ఎత్తి జగపతిబాబు సక్సెస్ అయ్యాడు. 2014లో బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన లెజెండ్ మూవీలో జగపతిబాబు కరుడుగట్టిన విలన్ రోల్ చేశాడు. ఈ మూవీ సూపర్ హిట్ కొట్టింది. విలన్ గా జగపతిబాబు నటనకు మార్కులు పడ్డాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా జగపతిబాబు రాణిస్తున్నాడు. పలు భాషల్లో చిత్రాలు చేస్తున్నారు. మంచి రూపం, ఒడ్డు పొడుగు ఉండే జగపతిబాబు అన్ని రకాల పాత్రలకు సెట్ అవుతారు. అది ఆయనకు కలిసొచ్చే అంశం..