యాక్షన్ హీరో అర్జున్ సర్జాలో మంచి దైవ భక్తి ఉంది. ముఖ్యంగా అర్జున్ హనుమంతుడు భక్తుడు. అందుకే తమిళనాడులోని చెన్నైలో హనుమంతుడి ఆలయాన్ని అంగరంగ వైభవంగా నిర్మించాడు. నిజానికి 15 ఏళ్ల క్రితం తలపెట్టిన గుడి నిర్మాణం ఇది. మధ్యలో ఎన్నో సమస్యలు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా అర్జున్ పట్టుదలతో ఈ గుడి నిర్మాణాన్ని పూర్తి చేశారు.
నేను తలపెట్టిన ఈ గుడి నిర్మాణం ఇప్పుడు పూర్తయిందంటూ అర్జున్ చెప్పుకొస్తూ ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోను కూడా పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో అర్జున్ ఏమి మాట్లాడాడు అంటే.. ‘నేను 15 సంవత్సరాలుగా నిర్మిస్తున్న ఆంజనేయస్వామి గుడి నిర్మాణం నేటితో పూర్తయింది. ఈ సందర్భంగా జూలై 1, 2 తారీఖుల్లో కుంభాభిషేకం జరుపుతున్నాం’ అంటూ అర్జున్ తెలిపాడు.
అయితే, ఈ గుడి నిర్మాణ కాలంలో తనకు సపోర్ట్ చేసిన వారి గురించి అర్జున్ మాట్లాడుతూ… ‘నా ఈ ప్రయాణంలో నాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇక కుంభాభిషేకం వేడుకను నా కుటుంబం, స్నేహితులు, అభిమానులు అందరినీ పిలిచి చాలా గ్రాండ్ గా చేయాలనుకున్నాను.కానీ కరోనా పరిస్థితుల వల్ల ఎవరికీ ఆహ్వానం పంపలేక పోతున్నందుకు చిన్న వెలితిగా ఉంది.
అయినప్పటికీ ఈ వేడుకను ఎవరూ మిస్ కావద్దన్న ఉద్దేశ్యంతో దీన్ని లైవ్ స్ట్రీమ్ చేస్తున్నాం’ అంటూ యాక్షన్ హీరో కూల్ గా చెప్పుకొచ్చాడు. మొత్తానికి అర్జున్ గుడిని నిర్మించి తన జీవితంలో ఎంతో గొప్ప పని చేశారు అని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
కాగా అర్జున్ ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.