Venu Madhav: కమెడియన్ వేణు మాధవ్ జీవితం ముగిసిన తీరు చాలా విషాదకరం. చివరి రోజుల్లో ఆయన ఆసుపత్రి బెడ్ కే పరిమితమయ్యారు. కోట్లాది మందిని తన కామెడీతో నవ్వించిన వేణు మాధవ్ చిన్న ప్రాయంలో లోకాన్ని వీడిపోయారు. 1996లో విడుదలైన సంప్రదాయం సినిమాతో వేణు మాధవ్ వెండితెరకు పరిచయం అయ్యాడు. అంచెలంచెలుగా ఎదిగి స్టార్ కమెడియన్ అయ్యాడు. 2004 తర్వాత వేణు మాధవ్ కెరీర్ పీక్స్ కి చేరింది. ఏడాదికి 20 సినిమాలకు పైగా చేసేవాడు. ఒక దశలో వేణు మాధవ్ లేకుండా సినిమా ఉండేది కాదు.
స్టార్ కమెడియన్ అయ్యాక వేణు మాధవ్.. నిర్మాతగా, హీరోగా కూడా మారారు. వేణు మాధవ్ హీరోగా ప్రేమాభిషేకం, హంగామా చిత్రాలు తెరకెక్కాయి. నటుడిగా దూసుకుపోతున్న తరుణంలో అనారోగ్యం ఆయన్ని క్రుంగదీసింది. చిన్నగా సినిమాలు తగ్గించుకుంటూ వచ్చాడు. పదుల సంఖ్యలో సినిమాలు చేసే వేణు మాధవ్ ఏడాదికి రెండు మూడు చిత్రాలకు పరిమితమయ్యాడు. 2015 తర్వాత పూర్తిగా వెండితెరకు దూరమయ్యాడు. వేణు మాధవ్ ఒక్కసారిగా కనుమరుగు కావడంతో ఆయన చనిపోయాడంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కథనాలు ప్రచారం చేశాయి.
Also Read: Brahmastra First Review: ‘బ్రహ్మాస్త్ర’ మూవీ మొట్టమొదటి రివ్యూ వచ్చేసింది
దీంతో మీడియా ముందుకు వచ్చిన వేణు మాధవ్ నేను బాగానే ఉన్నా… దయచేసి బ్రతికుండగానే చంపకండి అంటూ కన్నీరు పెట్టుకున్నారు. అప్పటికే వేణు మాధవ్ ఆరోగ్యం క్షీణించింది. 2019 సెప్టెంబర్ 25న వేణు మాధవ్ కన్నుమూశారు. వేణు మాధవ్ అకాల మృతికి చెడు అలవాట్లే కారణమన్న ప్రచారం జరిగింది. ఆయనకు విపరీతమైన ఆల్కహాల్, సిగరెట్ అలవాటు ఉండేదని, ఆ కారణంగా చనిపోయారన్న కథనాలు వెలువడ్డాయి.
ఈ పుకార్లకు వేణు మాధవ్ భార్య క్లారిటీ ఇచ్చారు. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు మాధవ్ భార్య పిల్లలు అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వేణు మాధవ్ మృతికి డెంగ్యూ ఫీవర్ కారణమని ఆమె చెప్పుకొచ్చారు. వ్యసనాలతో వేణు మాధవ్ చనిపోయారు అనడంలో నిజం లేదన్నారు. వేణు మాధవ్ మరణానికి కొన్ని రోజులు ముందు వాళ్ళ బ్రదర్ చనిపోయారు. దాంతో ఆయన డిప్రెషన్ కి లోనయ్యారు. డెంగ్యూకి చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేశారు. అది విషమించి ఊపిరితిత్తులు పాడైపోయాయి. ఆ కారణంగా వేణు మాధవ్ కన్నుమూశారని భార్య చెప్పుకొచ్చారు. వేణు మాధవ్ కుటుంబం కోసం ఆర్థికంగా కూడబెట్టిపోయారని వారు చెప్పారు.