YCP Graph: ఏపీలో ఎన్నికలకు దాదాపు ఏడాదిన్నరకుపైగా సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచే ఎన్నికల వాతావరణం నెలకొంది. వచ్చే ఎన్నికల్లో గెలుపోటములపై అంతటా చర్చ నడుస్తోంది. మరోవైపు సర్వేలంటూ కొన్ని బయటకు వస్తున్నాయి. అయితే అంతర్గతంగా అటు అధికార పార్టీ, విపక్షాలు ఎప్పటికప్పుడు వివిధ సంస్థలతో సర్వేలు చేయించుకుంటున్నాయి. పరిస్థితి బాగనే ఉంటే సంతోషపడుతున్నాయి.లేకపోతే లోపం ఎక్కడ ఉంటే అక్కడ సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే సర్వేలు ఎంతవరకూ ప్రమాణికమన్నది మాత్రం తెలియడం లేదు. ప్రస్తుతం ఎన్నికలకు సమయం ఉంది. ఈ సమయంలో ప్రజలు తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తపరుస్తారా? అన్న అనుమానం కూడా ఉంది. ఎందుకుంటే ప్రభుత్వానికి గడువు ఉండడంతో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు, ఇతరత్రా అవసరాలు ప్రభుత్వంతో ఉంటాయి. మరోవైపు పరిస్థితి తమకు అనుకూలంగా ఉందని చెప్పడానికి కొన్ని రాజకీయ పక్షాలు ఫేక్ సర్వేలను బయటకు వదులుతుంటాయి. వాస్తవానికి ఎన్నికలు ఇంత దూరంలో ఉన్న సమయంలో చేసిన సర్వేలకు ప్రజాభిప్రాయం దొరకడం చాలా కష్టం. అదే 2024 జనవరి,ఫిబ్రవరి మధ్య సర్వేలకు మాత్రం ప్రజానాడి దొరికే అవకాశముంటుంది. ఐదేళ్ల ప్రభుత్వ పాలన, విపక్షాల పనితీరును గమనించే ఓటరు నిర్థిష్టమైన ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం అప్పటికి ఏర్పడుతుంది.

తొలి నాళ్లలో హైప్..
అంతులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు ఏదో చేస్తుందని మాత్రం ప్రజల్లో ఆశలు ఉండేవి. దానికి తగ్గట్టుగానే హైప్ క్రియేట్ అయ్యింది. తొలి ఆరు నెలల్లో అసలు మాకు అడ్డే లేదన్న రేంజ్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నుంచి నేతల వరకూ వ్యవహరించారు. ఇక సంక్షేమ రాష్ట్రమన్న రీతితో ఫీల్ గుడ్ వాతావరణాన్ని సృష్టించారు. అయితే కరోనా ప్రవేశంతో కాస్తా పరిస్థితిలో మార్పు అయితే వచ్చింది. కానీ పెను విపత్తు కావడంతో ప్రభుత్వాన్ని ప్రజలు అర్ధం చేసుకున్నారు. సర్దుకొని ముందుకు సాగారు. అటువంటి క్లిష్ట సమయంలో మాత్రం ప్రభుత్వ పథకాలు ప్లస్ పాయింట్ గా నిలిచాయి. ఆర్థిక సంక్లిష్ట సమయంలో డబ్బులు చేతికందడంతో ప్రభుత్వ చర్యలపై అంతా సంతృప్తి కనిపించింది. రెండేళ్ల పాలన కొవిడ్ తోనే సాగిపోయింది. ప్రభుత్వం మూడో ఏట అడుగుపెట్టింది. కరోనా ప్రభావం కూడా తగ్గిపోయింది.
Also Read: Munugode Bypolls: తమ్ముడు రాజగోపాల్ రెడ్డిపై ప్రేమతో అన్న వెంకటరెడ్డి చేసిన పని..? అడ్డంగా బుక్?
ఎట్టకేలకు జనంలో మార్పు…
అయితే మూడేళ్ల పాటు ప్రభుత్వ చర్యలను అంతగా పట్టించుకొని జనం .. నాలుగో ఏట ప్రవేశించేసరికి అభివృద్ధి అనేది గుర్తుకు వచ్చింది. అమరావతి రాజధాని, పోలవరం, ప్రత్యేక రైల్వే జోన్లు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి సమస్యలు ప్రస్తావనకు రావడం ప్రారంభమయ్యాయి. మరోవైపు పెరుగుతున్న అప్పులు, కొత్తగా తెస్తున్న రుణాలు జనాల్లోచర్చకు వస్తున్నాయి. గతుకుల రహదారులు, మౌలిక వసతులు లేని గ్రామాలు కంటికి ఎదురుగా కనిపిస్తున్నాయి. దీనికితోడు విపక్షాలు పుంజుకొని గట్టి పోరాటాలు చేస్తుండడంతో ప్రభుత్వ పాలనా వైఫల్యాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైంది. రోజురోజుకూ తీవ్రమవుతోంది.
ప్రతిబంధకంగా రాజకీయ నిర్ణయాలు..
మరోవైపు రాజకీయంగా తీసుకుంటున్న కీలక నిర్ణయాలు వైసీపీ ప్రభుత్వానికి ప్రతిబంధకంగా మారుతున్నాయి. ముఖ్యంగా సజావుగా నడుస్తున్న మంత్రివర్గాన్ని తప్పించి.. కొత్తవారికి అవకాశం ఇవ్వడం అగ్నికి ఆజ్యం పోసినట్టయ్యింది. ఉన్న మంత్రి పదవులు పోయాయని కొందరు, ఆశపడి భంగపడ్డవారు, కొత్తగా మంత్రి పదవులు దక్కించుకున్నవారు.. ఇలా పార్టీలోవర్గ విభేదాలు ప్రారంభమయ్యాయి. ఎన్నికలకు ముందు చేరిన వారితో పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న వారు విభేదిస్తున్నారు.దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో విభేదాల పర్వం నడుస్తుందన్న ప్రచారం వైసీపీలోనేఉంది. గతంలో మంత్రి వర్గంలో ఓ పది మంది వరకూ ప్రభుత్వానికి రక్షణ కవచంలా ఉండేవారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేసినా,విమర్శలు వచ్చినా ప్రతిదాడికి దిగేవారు. తాజా మంత్రివర్గంలో ఆ పరిస్థితిలేదు. ఒకరిద్దరు తప్పిస్తే అందరూ సైలెంట్ అయ్యారు. దీంతో విపక్షాల ఆరోపణలు, ఎదురుదాడులు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వాటిని మాత్రం తాజా మంత్రులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. మంత్రివర్గ విస్తరణ జరిగిన ఈ ఆరు నెలల్లో సీన్ మారిపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు.

విపక్షాలు స్ట్రాంగ్…
అధికార పక్షం వాయిస్ తగ్గగా.. విపక్షాలు మాత్రం స్ట్రాంగ్ అవుతున్నాయి.హైకమాండ్ చేసిన పొరపాటు కారణంగా కేబినెట్ లో నోరున్న మంత్రులు లేకుండా పోయారు. మూడేళ్ల పాలన పూర్తవుతుండడంతో అధికార పార్టీలో అసమ్మతి స్వరాలు ఊపందుకుంటున్నాయి, ఎక్కడికక్కడే కేడర్,నాయకత్వం మధ్య గ్యాప్ ఉంది. అటు హైకమాండ్ కూడా చూసీచూడనట్టుగా వ్యవహరిస్తుండడంతో పరిస్థితి మరింత బిగుసుగా మారుతోంది. మరోవైపు కేంద్ర పెద్దల వ్యవహార శైలిలో కూడా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సరైన టైము చూసి వారు పట్టుబిగించడం ప్రారంభించారు. అదే సమయంలో విపక్షాలన్నీ ఏకమైతే వైసీపీ ఓడిపోవడం ఖాయమన్న భావన ప్రజల్లో నాటుకుపోతోంది. దానికి తగ్గట్టుగానే బీజేపీతో టీడీపీ, జనసేన కలిసేందుకు ప్రయత్నాలు ముమ్మరం కావడం వైసీపీకి మింగుడుపడడం లేదు. మూడేళ్ల పాలన పూర్తికావడం.. స్వల్ప వ్యవధే ఉండడం.. మెరుపులు మెరిపించడానికి అవకాశం లేకపోవడంతో అధికార వైసీపీకి ప్రమాద ఘంటికలు మోగే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి.
[…] […]