
కోవిడ్ సెకెండ్ వేవ్ కేసులు తగ్గుతున్నాయని థియేటర్లు ఓపెన్ చేశారు. మరోపక్క ఆంధ్రలో కేసులు పెరుగుతున్నాయనేది నిజం. మూడో వేవ్ కూడా ఉందని అంటున్నారు. ప్రభుత్వాలు ప్రస్తుతానికి సినిమాల రిలీజ్ కి అనుమతులు ఇచ్చినా మళ్లీ ఎప్పుడు ఆంక్షలు విధిస్తారో తెలియదు. అయితే వచ్చే నెల నుండి మూడో వేవ్ వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తోన్న నేపథ్యంలో కూడా పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు బయటకు వస్తున్నాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాని జనవరి 13, 2022 రిలీజ్ అవుతుందని పోస్టర్ ను కూడా వదిలారు. ఇప్పటికే ప్రభాస్ ‘రాధేశ్యామ్’ డేట్ కూడా వచ్చేసింది. ఇది జనవరి 14, 2022. ఇక పవన్ కళ్యాణ్ – రానా కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కూడా సంక్రాంతికే వస్తోందట. ఇది జనవరి 12, 2022 ఉండొచ్చు.
ఇక వెంకటేష్, వరుణ్ తేజ్ ల మల్టీస్టారర్ “F3” కూడా జనవరి 12నే అంటున్నారు. ఇది పెద్ద సినిమాల రిలీజ్ పరిస్థితి. అసలు ఇప్పుడు తెరుచుకునే థియేటర్లు మళ్ళీ ఎప్పుడు మూత బడతాయో తెలియదు. దీనికితోడు ఇంకా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రతి జిల్లాలో కనీసం వందల కేసులు తక్కువ లేకుండా ఉంటున్నాయి,
ఇంచుమించుగా తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి వుంది. కాకపోతే ఆంధ్రతో పోల్చుకుంటే తెలంగాణలో నమోదు అవుతున్న కరోనా కేసుల సంఖ్య తక్కువ. పెరిగే అవకాశం ఉంది. మరి ఇలాంటి నేపథ్యంలో సినిమాలను ఏ నమ్మకంతో రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు ? సినిమాల విడుదల ఆగిపోతే అది వేరే సంగతి. అలా కాకుండా సినిమాలు విడుదల తరువాత సడెన్ గా కేసులు పెరిగి జనం థియేటర్స్ కి రాకపోతే ? పెద్ద సినిమాలు భారీగా నష్టపోవాల్సి వస్తోంది. మరి మేకర్స్ ఏమి చేస్తారో చూడాలి.