
ఫహద్ ఫాజిల్ తన నటనతో మరొక లోకానికి తీసుకువెళ్తే, సాయి పల్లవి తన నటనతో ఉన్న లోకాన్ని కూడా మరిపించేస్తోంది. మరి ఈ జంట కలిసి నటిస్తే ? కథాకథనాలు ఎలా ఉన్నా కేవలం వీరిద్దరూ కలిసి నటించారనే ఒకే ఒక్క రీజన్ చాలు, ప్రేక్షకులు వీరి సినిమాని చూడటానికి. అవును, ఆ తరుణం రానుంది. వీరిద్దరూ కలిసి నటించిన మలయాళ చిత్రం ‘అతిరన్’ త్వరలోనే తెలుగు నెట్టింట లోగిళ్ల ముందుకు రాబోతుంది.
2019లో థియేటర్లలో మలయాళ ప్రేక్షకుల్ని థ్రిల్ చేసిన ఈ చిత్రం, తెలుగులో ‘అనుకోని అతిథి’ అనే పేరుతో ప్రముఖ ఓటీటీ ఆహాలో మే 28 నుంచి స్ట్రీమింగ్ కానుందని ఎనౌన్స్ వచ్చినప్పటి నుండి ఆడియన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోపక్క రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న ఈ నేపథ్యంలో ఆహా బృందం ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది.
ఈ క్రమంలో ఈ చిత్రం టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ లో మెయిన్ కంటెంట్ ను ఎలివేట్ చేస్తూ షాట్స్ ను కట్ చేసిన విధానం, అలాగే పాత్రల పరిచయాలతో పాటు, ఆ పాత్రల తాలూకు ఎమోషన్స్ కూడా బాగా ఎస్టాబ్లిష్ అయ్యాయి. టీజర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. మొత్తానికి ఈ టీజర్ సినిమా పై ఆసక్తిని రెట్టింపు చేసింది.
ఇక టీజర్ లో క్లాసిక్ బ్యూటీ సాయి పల్లవి తన హావభావాలతో పాటు ఆమె పాత్రలోని వైవిధ్యం కూడా బాగుంది. మొత్తమ్మీద టీజర్ ను చూస్తుంటే ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో జరిగిన ఎమోషనల్ సస్పెన్స్ డ్రామాలా అనిపిస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ డైరెక్షన్ లో రానున్న ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, అతుల్ కులకర్ణి కీలక పాత్రలలో కనిపించనున్నారు. పైగా ఈ సినిమాని జిబ్రాన్ సంగీతం అందించడం విశేషం.