
అమెరికాలో పుట్టి దక్షిణాది సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకున్న నటి అనూ ఇమాన్యుయేల్. మళయాలంలో తెరంగేట్రం చేసినా 2017లో నాని సరసన ‘మజ్ను’లో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆపై, తమిళ చిత్ర పరిశ్రమలో కూడా కాలు పెట్టిన అనూ.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోల పక్కన అవకాశాలు అందుకుంది. గోపీచంద్ సరసన ఆక్సిజన్ సినిమాలో నటించిన ఈ బ్యూటీ.. మెగా కాంపౌండ్‌లో కూడా అడుగుపెట్టింది. ఏకంగా పవన్ కళ్యాణ్ తో నటించింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ లో ఓ హీరోయిన్గా యాక్ట్ చేసింది. ‘నా పేరు సూర్య’లో అల్లు అర్జున్‌తో ఆడిపాడింది. అలాగే, అక్కినేని నాగచైతన్య సరసన ‘శైలాజ రెడ్డి అల్లుడు’లోనూ సోలో హీరోయిన్గా చేసిందామె. కానీ, ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.
వరుస ఫ్లాప్స్ రావడంతో అనుపై ఐరెన్ లెగ్ ముద్ర పడింది. అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడంతో ఆమె టాలీవుడ్‌కు దూరమైంది. అటు మళయాలం, తమిళ్లో కూడా అవకాశాలు కరువయ్యాయి. ఇప్పుడు గెస్ట్ రోల్స్, చిన్న పాత్రలు చేసే స్థాయికి దిగజారింది. ‘గీత గోవిందం’లో అను చిన్న గెస్ట్ రోల్ చేయగా ఆ మూవీ సూపర్ హిట్టయింది. దాంతో, ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు. చిన్న పాత్రల కోసం ఆమెను సంప్రదిస్తున్నారట. ఈ క్రమంలో బెల్లంకొండ శ్రీను హీరోగా సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ‘అల్లుడు అదుర్స్’లో విలన్ భార్య పాత్రను అను ఇమాన్యుయేల్ పోషిస్తోందని సమాచారం. ఈ సినిమాలో సోనూ సూద్ ప్రతి నాయకుడు. సో.. సోనూ భార్యగా అను నటిస్తుందన్నమాట. నాని, నాగచైతన్య, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ సరసన నటించిన అనూకు..ఇప్పుడు విలన్ క్యారెక్టర్ తో రొమాన్స్ చేసే పరిస్థితి రావడం ఆమె దురదృష్టమే అనాలి.