Sirivennela Seetha Rama Sastri: తన పద ప్రయోగంతో తెలుగు సినిమా పాటలకు సరికొత్త అర్థాన్ని చెప్పిన ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సిరివెన్నెల మృతి సినీ ప్రపంచానికి తీరని లోటని అన్నారు. తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల అని… అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులుగా నిలిచి ఉంటాయని కొనియాడారు. ఆయన హఠాన్మరణం తెలుగువారికి తీరనిలోటని ట్వీట్ చేశారు . సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో న్యూమోనియాకు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా ఆయన న్యూమోనియాతో బాధపడుతున్నారు. ఈనెల 24 తీవ్ర అస్వస్థతకు గురై సీతారామశాస్త్రిని సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆయనకు ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ మరింత తీవ్రమవడంతో కన్నుమూశారు. ఆయన రాసిన గంగావతరణం కవిత చూసి ‘సిరివెన్నెల’ చిత్రంలో పాటలు రాసే అవకాశమిచ్చారు దర్శకుడు కె.విశ్వనాథ్. ‘సిరివెన్నెల’ సినిమాకు అద్భుతమైన పాటలు రాసి ఆ సినిమా విజయంలో కీలక భాగమయ్యారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. 2/2
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 30, 2021
దాంతో సీతారామ శాస్త్రి పేరు కాస్తా ‘సిరివెన్నెల’ గా మారిపోయింది. కె.విశ్వనాథ్ ఆయనను ప్రేమగా సీతారాముడు అని పిలుస్తారు. 3000 పైగా పాటలు రచించారు సిరివెన్నెల. విధాత తలపున ప్రభవించినది… అంటూ ఆయన రాసిన మొదటి పాటే తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ఆయనకు చిరస్థానం సంపాదించి పెట్టింది. పదకొండు నంది అవార్డ్స్… పద్మ శ్రీ అవార్డ్ అందుకున్నారు. సిరివెన్నెల మృతితో తెలుగు చిత్రపరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.
Also Read: Mahesh Babu: అందరూ సంతోషమే.. ఒక్క మహేష్ అభిమానులు తప్ప !