Allu Arjun Arrested: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం ఎన్ని వివాదాలకు దారి తీసిందో మనమంతా చూసాము. సంధ్య థియేటర్ లో ‘పుష్ప 2’ ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసిలాటలో, రేవతి అనే మహిళ చనిపోవడానికి కారణం అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్లనే అని ఆయన పై FIR నమోదు అవ్వడంతో, పోలీసులు నిన్న ఆయన్ని చాలా అగౌరవపరుస్తూ జైలుకు తీసుకెళ్లిన విజువల్స్ మీడియా లో సంచలనంగా మారింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ కి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన ఒక వ్యక్తిని ఇంతలా టార్గెట్ చేయడం సరికాదని, సరైన సమయంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడంలో విఫలమైన పోలీసులపై యాక్షన్ తీసుకోకుండా, కేవలం అల్లు అర్జున్ ని ఒక్కడినే కారణం చేస్తూ అరెస్ట్ చేయడం చాలా అన్యాయం అంటూ సోషల్ మీడియాలో ఆయన అభిమానులతో పాటు, పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు తప్పుబట్టారు.
ఇదంతా పక్కన పెడితే నేడు కాసేపటి క్రితమే అల్లు అర్జున్ చంచల్ గూడ జైలు నుండి విడుదల అయ్యాడు. భారీ సెక్యూరిటీ మధ్య ఆయన్ని ఇంటికి చేర్చారు పోలీసులు. నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు అనే విషయాన్ని తెలుసుకొని షాక్ కి గురైన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తండ్రి గారైన అల్లు అరవింద్ కి ఫోన్ చేసి ధైర్యం చెప్పాడని, ఎలాంటి అధైర్యం పడొద్దు, మరీ పరిస్థితులు చెయ్యి దాటిపోతే నేను రేవంత్ రెడ్డి తో స్వయంగా మాట్లాడుతాను అని భరోసా ని ఇచ్చాడట. అంతే కాకుండా విడుదలైన వెంటనే చంద్రబాబు అల్లు అర్జున్ కి కూడా ఫోన్ చేసి, అతని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. నిన్న స్వర్ణాంధ్ర 2047 మీటింగ్ విజయవాడ లో జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తో పాటు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నాడు.
వీళ్లిద్దరు మీటింగ్ లో ఉన్నప్పుడే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సమాచారం తెలిసింది. వెంటనే ఆయన స్పెషల్ ఫ్లైట్ లో విజయవాడ నుండి హైదరాబాద్ కి బయలుదేరినట్టు మీడియా లో వార్తలు వచ్చాయి కానీ, అల్లు అర్జున్ ఇంటికి వెళ్లినట్టుగా ఎలాంటి సమాచారం లేదు. బహుశా పవన్ కళ్యాణ్ నేడు అల్లు అర్జున్ ని కలిసి, మళ్ళీ తిరిగి విజయవాడ కి వెళ్లొచ్చు. ఆయన అరెస్ట్ విషయం గురించి తెలిసినప్పటి నుండి మెగా ఫ్యామిలీ మొత్తం అల్లు అర్జున్ ఇంట్లోనే రోజంతా గడిపింది. మెగాస్టార్ చిరంజీవి తన ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ ని కూడా రద్దు చేసుకొని, తన భార్య సురేఖ తో కలిసి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళాడు. నాగబాబు కూడా నిన్నంతా అల్లు అర్జున్ ఇంట్లోనే గడిపి అతని విడుదల కోసం తనవంతు ప్రయత్నాలు చేసాడు. ఇలా మెగా ఫ్యామిలీ మొత్తం ఒక్కటి అవ్వడానికి ఈ అరెస్ట్ జరిగిందని సోషల్ మీడియా లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.