Razakar : భారతి.. భారతి ఉయ్యాలో.. బంగారు భారతి ఉయ్యాలో.. సూడమ్మ భారతి ఉయ్యాలో.. నీకు బతుకమ్మ హారతి ఉయ్యాలో.. తెలంగాణలో బతుకమ్మ పండుగ వస్తుంది కదా.. ఇదేదో బతుకమ్మ పాట అనుకునేరు. బతుకమ్మ పాటే.. కానీ ఈ పాట సంతోషంగా, సంబురంగా జరుపుకునే బతుకమ్మ సందర్భంగా పాడిన పాట కాదు. రజాకార్ రాక్షసకాండను కళ్లకు కట్టిన ఉయ్యాల పాట. రజాకార్ సినిమాలోని ఈ పాటను నిర్మాతలు బుధవారం రిలీజ్ చేశారు. తెలంగాణలో రజకార్ల ఆగడాలను చాటి చెబుతూ సాగిన భారతి భారతి ఉయ్యాలా సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అనసూయ లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమా నుంచి బతుకమ్మ పండుగ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ పాట రావడం విశేషం. భారతి భారతి ఉయ్యాలో అంటూ సాగే ఈ పాట హత్తుకునేలా ఉంది. వింటుంటే తెలంగాణలో రాజకార్లు సాగించిన దమనకాండ కళ్లముందు కదలాడుతుంది.
అనసూయ నటన అదుర్స్..
ఈ పాటలో అనసూయ నటనకు అభిమానులు వందకు వంద మార్కులు వేస్తున్నారు. విడుదలైన గంటల వ్యవధిలోనే వేల వ్యూస్ సాధించిన ఈ పాటలో అనసూయ నటన అద్భుతమని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సాంగ్ యూట్యూబ్ లింక్‌ను షేర్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో అనసూయ ఓ పోస్ట్ చేసింది. “రజాకార్ మూవీలో ఈ పాటలో నటించడాన్ని చాలా ఆస్వాదించాను. భారతి భారతి ఉయ్యాల సాంగ్ మీ కోసం. మీకు కూడా అలాంటి వైబ్ కలుగుతుందని భావిస్తున్నాను. హైదరాబాద్ లో నిశ్శబ్దంగా జరిగిన మారణ హోమం” అంటూ ఈ పాటను అనసూయ షేర్ చేసుకుంది.
రచయిత కాసర్ల శ్యామ్..
ఇక ఈ భారతి భారతి ఉయ్యాలా సాంగ్ ను కాసర్ల శ్యామ్ రాశాడు. భారతి భారతి ఉయ్యాలో.. బంగారు భారతి ఉయ్యాలో.. సూడమ్మ మా గతి ఉయ్యాలో.. నీకు బతుకమ్మ హారతి ఉయ్యాలో అంటూ ఈ పాట సాగిపోయింది. ఈ పాటను భీమ్స్ సీసిరోలియో కంపోజ్ చేశాడు. ఇక మోహన భోగరాజు, భీమ్స్ సీసిరోలియో, స్ఫూర్తి జితేందర్ ఈ పాట పాడారు. బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు యాట సత్యనారాయణ రచన, దర్శకత్వం వహిస్తున్నాడు. తెలంగాణ పల్లెల్లో రజాకార్లు సృష్టించిన మారణహోమాన్ని చెబుతూ ఈ భారతి భారతి ఉయ్యాలో పాట సాగిపోయింది. అనసూయతోపాటు ఇతర నటీనటులపై ఈ పాటను చిత్రీకరించారు. పాటలో సాంగ్ మేకింగ్ విజువల్స్ కూడా చూపించారు.
తెలంగాణ పల్లెలు బతుకమ్మ ఉత్సవాల కోసం సిద్ధమవుతున్న నేపథ్యంలో రజాకార్ మూవీ నుంచి ఈ భారతి భారతి ఉయ్యాలో పాట రావడం విశేషం. నిజాం పాలనలో రజాకార్ల మారణకాండపై ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు.