Amrutha Pranay: ప్రణయ్ పై జరిగిన ఉదంతంలో పాలుపంచుకున్న A3 అజ్గర్ అలీ, A4 అబ్దుల్ భారీ, A5 ఏం ఏ కరీం, A6 తిరునగరి శ్రవణ్ (మారుతీ రావు సోదరుడు), A7 సముద్రాల శివ (మారుతీ రావు డ్రైవర్) A8 నజీం(ప్రణయ్ పై దారుణానికి పాల్పడిన నిందితులు ప్రయాణించిన ఆటో తోలిన డ్రైవర్) కు నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే వీరిలో కొంతమంది బెయిల్ మీద బయట ఉండగా.. వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని.. న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వారిని జైలుకు తరలించారు. ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పును వెల్లడించిన తర్వాత తిరునగరి శ్రవణ్(మారుతీ రావు) కుమార్తె అమృత పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ఘటన జరగడానికి మొత్తం అమృతనే కారణమని ఆరోపించింది. అమృత వల్లే తన తండ్రి జైలు శిక్ష అనుభవిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదని.. ఇప్పటికే చాలా సంవత్సరాలుగా ఆయనకు దూరంగా ఉన్నామని.. కోర్టు తీర్పుతో జీవితాంతం ఆయన జైలు శిక్ష అనుభవించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. తన తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడని.. ఈ కేసుతో తనకు సంబంధం లేదని.. పోలీసులు అనవసరంగా ఆయనను అరెస్టు చేశారని.. తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకుని అదుపులోకి తీసుకున్నారని ఆరోపించింది. ఆయన ప్రేమకు దూరమై మేము చాలా ఇబ్బంది పడుతున్నామని.. జీవిత ఖైదు విధించడంతో ఆయన మాకు ఇక శాశ్వతంగా దూరం అవుతారని.. శ్రవణ్ కుమార్తె కన్నీటి పర్యంతమైంది.
Also Read: సమంత అతనితో నిజంగానే డేటింగ్ చేస్తుందా? మరోసారి వార్తల్లోకి స్టార్ లేడీ!
తొలిసారిగా స్పందించిన అమృత
ప్రణయ్ కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు తుది తీర్పు వెల్లడించిన నేపథ్యంలో.. ప్రణయ్ భార్య అమృత తొలిసారిగా స్పందించింది. ప్రణయ్ కేసులో నిందితులకు కోర్టు మరణ, యావజ్జీవ కారగార శిక్ష విధించడం పట్ల అమృత సోషల్ మీడియా వేదికగా స్పందించింది. “ఏడు సంవత్సరాల నిరీక్షణ తర్వాత న్యాయం లభించింది. ఈ తీర్పు తోనైనా పరువు పేరుతో జరిగే నేరాలు తగ్గుముఖం పట్టాలి. దౌర్జన్యాలు తగ్గాలి. ప్రేమ గెలవాలి. ప్రేమ వివాహాలు చేసుకునే వారికి స్వేచ్ఛ లభించాలి. ఈ ప్రయాణంలో మాకు మద్దతు ఇచ్చిన పోలీస్ శాఖకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, మీడియాకు నా ధన్యవాదాలు. ఈ సంఘటనపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేయాలని అనుకున్నాను. కానీ నా కొడుకు భవిష్యత్తు దృష్ట్యా ప్రెస్ మీట్ పెట్టకూడదని నిర్ణయించుకున్నాను. మమ్మల్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.. రెస్ట్ ఇన్ పీస్ ప్రణయ్ 10-03-2025” అంటూ అమృత తన ఇన్ స్టా గ్రామ్ లో రాస్కొచ్చింది.