Pushpa The Rule : అతి చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కనీవినీ ఎరుగని రేంజ్ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతున్న చిత్రం ‘బేబీ’. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య , విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు నుండే దుమ్ము లేచిపోయే రేంజ్ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. ఈ రేంజ్ వసూళ్లు ఈమధ్య స్టార్ హీరో సినిమాలకు కూడా రాలేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.
విడుదలకు ముందు నుండే ట్రైలర్ మరియు పాటలతో ఆకట్టుకున్న ఈ చిత్రం, కేవలం వారం రోజుల్లోనే మూడింతలు పైగా వసూళ్లను రాబడుతూ చరిత్ర తిరగరాసింది. ఇప్పటికే ఈ సినిమా అదే రేంజ్ దూకుడుతో దూసుకుపోతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ఈ నేపథ్యం లో హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసారు. ఈ సక్సెస్ మీట్ కి స్టైలిష్ స్టార్ అల్ల్లు అర్జున్ ముఖ్య అతిధిగా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన ఈ చిత్రం గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి.
ఆయన మాట్లాడుతూ ‘సాధారణంగా నన్ను ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కానీ, సక్సెస్ ఈవెంట్ కి కానీ పిలిచినప్పుడు అయ్యో రెండు మూడు గంటలు వేస్ట్ అయిపోతుందే అని అనుకుంటూ ఉంటాను.కానీ ఈ సినిమా సక్సెస్ మీట్ కి పిలిచినప్పుడు ఎందుకో నాకు మనస్ఫూర్తిగా వచ్చి మాట్లాడాలి అనిపించింది. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్లంతా ఏ స్థాయి నుండి వచ్చారో, ఇప్పుడు ఎలా ఉన్నారో అన్నీ నేను దగ్గరుండి చూసాను. సాయి రాజేష్ గారు గతం లో స్పూఫ్ సినిమాలు చేస్తుండడం చూసిన కొంతమంది మేకర్స్ ఆయనతో సినిమా చెయ్యాలంటే భయపడేవారట. ఆయనతో సినిమాలేంటి , టైం వేస్ట్ అని వెనక్కి పంపేసేవారట. ఈరోజు ఆయన తీసిన ఈ సినిమాని చూస్తే, ఆరోజు ఆయన్ని అవమానించిన వాళ్ళే నేడు అడ్వాన్స్ పట్టుకొని మాతో సినిమా చెయ్యి అనే రేంజ్ సినిమాని అందించాడు, నాకు చాలా గర్వం గా ఉంది అతనిని చూస్తుంటే ‘ అని చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్.
ఇక చివర్లో ప్రస్తుతం అక్కడికి వచ్చిన వాళ్లంతా పుష్ప నుండి డైలాగ్ కొట్టమని అడగగా అప్పుడు అల్లు అర్జున్ డైలాగా?, ఆమ్మో ఇది చిరు లీక్స్ కంటే డేంజర్ గా ఉంది అని అంటూ ‘ఈ సినిమా పేరు పుష్ప 2 : ది రూల్ , కానీ ఒక్కటే చెప్తున్నాను ఇక్కడ జరిగేది మొత్తం ఒక రూల్ ప్రకారం జరుగుతున్నాది, అదే పుష్ప గాడి రూల్ ‘ అంటూ అల్లు అర్జున్ లీక్ చేసిన డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
Straight from Pushpa Raj’s mouth. Here’s a dialogue from #Pushpa2TheRule pic.twitter.com/dUZue55TPu
— Aakashavaani (@TheAakashavaani) July 20, 2023