అదో యాక్సిడెంట్.. కావాలని చేసింది కాదు.. జరిగిన ఘోరానికి ఆయన అసలు బాధ్యుడు కాదు.. అయినా ఆయన్నే టార్గెట్ చేశారు. ప్రాణం పోయిందని.. ఒక ప్రాణం ఊపిరిపై ఉందని ఆడిపోసుకున్నారు.. అయినా ఆ హీరో పడ్డాడు. ఆ కుటుంబానికి జీవితంలో చూడనంత , అందుకోలేనంత సాయం చేశాడు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇ శ్రీతేజ్ ను బతికించాడు. అయినా ఇప్పటికీ ఆ అపనిందలు అల్లు అర్జున్ మోస్తూనే ఉన్నాడు. శ్రీతేజ్ కుటుంబానికి ఎంతో చేసినా చెప్పుకోలేని స్థితిలో బన్నీ ఉన్నాడు. కానీ కొన్ని వక్రమీడియాలు మాత్రం బన్నీని టార్గెట్ చేసి శ్రీతేజ్ ను పావుగా వాడుతూ ఇప్పటికీ విషం చిమ్మూతూనే ఉన్నాయి. బన్నీ ఆ కుటుంబానికి ఎంత చేశాడన్నది మాత్రం ఎవరూ చెప్పడం లేదు. ఆ నిజాన్ని బయటపెట్టడం లేదు.

గత కొంతకాలంగా సోషల్ మీడియాలో హీరోల మీద, ముఖ్యంగా అల్లు అర్జున్ మీద జరుగుతున్న నిరాధారమైన, ద్వేషపూరిత ప్రచారం చూస్తే చాలా బాధ కలుగుతోంది. ఒక విషయాన్ని గురించి పూర్తి నిజాలు తెలుసుకోకుండా కేవలం హీరోల మధ్య ‘ఫ్యాన్ వార్స్’ కోసం ఇంత చీప్‌గా, నెగటివ్‌గా ప్రచారం చేయడం వల్ల ఎవరికి ఏమీ ఒరగదు. కనీసం ఇలాంటి సున్నితమైన విషయాల్లోనైనా సంయమనం పాటిద్దాం.
ఇప్పుడు అల్లు అర్జున్ – శ్రీతేజ్ అంశం మరోసారి వార్తల్లో నిలుస్తోంది.. కొందరు కావాలనే అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ అల్లు అర్జున్‌పై బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, నిజంగా అక్కడ ఏం జరిగింది, శ్రీతేజ్ కోసం అల్లు అర్జున్ ఎంత చేశారు అనే వాస్తవాలను ఒకసారి పరిశీలిద్దాం.

అల్లు అర్జున్ చేసిన సహాయం ఇదే
తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ చికిత్స కోసం అల్లు అర్జున్ ఇప్పటివరకు దాదాపు ₹ 3.25 కోట్లు ఖర్చు చేశారు.ఇందులో ₹ 1.5 కోట్లు శ్రీతేజ్ భవిష్యత్తు కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో ఉన్నాయి. దీనిపై ఇప్పటివరకు వచ్చిన ₹ 17 లక్షల వడ్డీని కూడా బ్యాంక్ శ్రీతేజ్ తండ్రికి అందజేసింది. పెండింగ్‌లో ఉన్న హాస్పిటల్ ఖర్చులు ₹ 75 లక్షల దాకా అల్లు అర్జున్ స్వయంగా చెల్లించారు. చికిత్స తర్వాత శ్రీతేజ్ కోసం అయ్యే రిహాబిలిటేషన్ ఖర్చు కూడా తామే భరిస్తామని అల్లు అర్జున్ బృందం చెప్పింది. అయితే దీనికి దిల్ రాజు గారు మధ్యవర్తిగా ఉండి, “ఆ బాధ్యత నేను చూసుకుంటాను” అని చెప్పినట్లు తెలుస్తోంది. ఇంత మొత్తం ఖర్చు పెట్టి, ఒక బాధిత కుటుంబానికి అండగా నిలబడి, భవిష్యత్తు కోసం కూడా ఆర్థిక భరోసా కల్పించిన వ్యక్తిని, కేవలం ద్వేషంతో, అభూత కల్పనలతో విమర్శించడం ఎంతవరకు సమంజసం?

ఇకనైనా వదిలేయండి!
ఒక వ్యక్తి ఇంత పెద్ద మనసుతో సహాయం చేసిన తరువాత కూడా ఇక వదిలేస్తారా? అని ప్రశ్నించడం చాలా దురదృష్టకరం. అసలు ఆ సహాయం చేయాలనే బాధ్యత లేకపోయినా, మానవత్వంతో ముందుకు వచ్చి ఇంత చేసిన తరువాత కూడా వారిపై విమర్శలు చేయడం, నెగటివ్ ప్రచారం చేయడం దారుణం.
ఫ్యాన్ వార్స్ ఎంతవరకైనా పర్వాలేదు.. కానీ మానవత్వం, నిజ జీవితంలో జరిగిన సహాయం వంటి విషయాల్లో కూడా తప్పుడు సమాచారాన్ని షేర్ చేయకుండా ఉండటం ఉత్తమం. హీరోల పట్ల ఉండే ద్వేషాన్ని పక్కన పెట్టి, వాస్తవాలను గ్రహించాలి. ఇటువంటి ప్రచారాలు ఆపేసి, నిజమైన సమాచారాన్ని మాత్రమే పంచుదాం.