Gaddar Awards Controversy : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గద్దర్ అవార్డ్స్(Gaddar Awards) ని నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు కూడా గత పదేళ్లుగా ప్రేక్షకాదరణ పొందిన సినిమాలలో కొన్నిటిని ఎంచుకొని ‘ఉత్తమ చిత్రం’ క్యాటగిరీలో అవార్డ్స్ ప్రకటించారు. అయితే అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ని ఉత్తమనటుడిగా, నాగ్ అశ్విన్(Nag Aswin) ని ఉత్తమ దర్శకుడిగా ఎంచుకోవడం పై ప్రజా సాంస్కృతిక వేదిక తీవ్ర స్థాయిలో మండిపడింది. వేదిక అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ‘తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ గద్దర్ అన్న ఆశయాలకు విరుద్ధం గా ఉన్నది’ అంటూ మండిపడ్డాడు. తెలంగాణ సమాజాన్ని కించపరిచే విధంగా ఉన్నటువంటి ‘రజాకార్’ చిత్రాన్ని ఉత్తమ చారిత్రాత్మక చిత్రంగా ఎంపిక చేయడం అత్యంత దారుణమని ఆయన ఆరోపించారు. అదే విధంగా అల్లు అర్జున్ ని ఉత్తమ నటుడిగా, నాగ్ అశ్విన్ ని ఉత్తమ డైరెక్టర్ గా ఎంపిక చేయడం కూడా సరికాదని ఆయన తప్పుబట్టారు.
ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తూ అసాంఘిక కార్యకలాపాల పాత్ర చేసిన హీరో కి అవార్డు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. అంతే కాకుండా ఈ అవార్డ్స్ కేవలం తెలంగాణ కళాకారులకు మాత్రమే అందిస్తే బాగుంటుందని, అల్లు అర్జున్, నాగ్ అశ్విన్ వంటి వారు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కాదని ఆయన చెప్పుకొచ్చాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. అల్లు అర్జున్ అభిమానుల నుండి ఛీత్కారాలు కూడా వస్తున్నాయి. నటనని కేవలం నటనగా మాత్రమే చూడాలని, ఆడియన్స్ ని ఎంత మేరకు అలరించాము అనేదే పరిగణలోకి తీసుకోవాలి కానీ, హీరో ఎలాంటి పాత్ర పోషించాడు అనేది పరిగణలోకి తీసుకోవడం బుర్ర తక్కువ తనం అవుతుందని అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా మండిపడుతున్నారు. కేవలం ప్రతిభ ని చూసే అవార్డ్స్ ఇస్తారని, ఏ ప్రాంతం నుండి వచ్చాడు అనేది చూసి ఇవ్వరని, రేవంత్ సర్కార్ ప్రాంతాలకు అతీతంగా ఈ అవార్డ్స్ ని ప్రకటించడం ఉన్నతమైన విషయమని అల్లు అర్జున్ అభిమానులు కొనియాడారు.
ఇకపోతే అల్లు అర్జున్ కి టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరికంటే ‘గద్దర్ అవార్డ్స్’ లో ఎక్కువ ప్రాధాన్యత లభించింది. పుష్ప 2 కి ఉత్తమనటుడిగా ఎంపికైన అల్లు అర్జున్, గతం లో ఆయన హీరో గా నటించిన ‘అలా వైకుంఠపురం లో’, అదే విధంగా సపోర్టింగ్ రోల్ చేసిన ‘రుద్రమదేవి’ చిత్రాలు కూడా ఉత్తమ చిత్రాల క్యాటగిరీలో ఎంపిక అయ్యాయి. ఒకవేళ రాబోయే రోజుల్లో పాత సినిమాలకు సంబంధించిన ఉత్తమ నటుడు క్యాటగిరీలో అవార్డ్స్ ని ప్రకటిస్తే మళ్ళీ అల్లు అర్జున్ లిస్ట్ లోకి వచ్చే అవకాశాలు ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.