Alia&Ranbir: బాలీవుడ్లో లవ్‌బర్డ్స్‌గా పిలువబడే అలియా భట్, రణ్‌బీర్ కపూర్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారు. గత కొన్న సంవత్సరాలుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నవిషయం తెలిసిందే. ఎక్కడికైనా కలిసి వెళ్లడం, బహిరంగంగా వారి ప్రేమ గురించి మాట్లాడంతో వీరి జంట ఫేమస్‌గా నిలిచింది.
దానికి తోడు అభిమానులు వీరిని చూసి ముచ్చటైన జంట అంటుంటారు. ఈ క్రమంలోనే ఈ జంట నవంబరు 29న నిశ్చితార్థం చేసుకునేందుకు సిద్ధమైనట్లు బాలీవుడ్లో టాక్ నడుస్తోంది. రాజస్థాన్ వేదికగా ఈ వేడుక జరగనున్నట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో వీరు వివాహం చేసుకోనున్నారట.
అయితే, గతేడాదిలోనే వీరి పెళ్లి జరగాల్సి ఉంది. అయితే, కరోనా కారణంగా వాయిదా పడినట్లు రణ్‌బీర్ కపూర్ స్వయంగా తెలిపారు. ప్రస్తుతం వీరిద్దరూ వరుస చిత్రాల్లో షూటింగులతో బిజీగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియాభట్ టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతోంది. మరోవైపు, అలియా- రణ్‌బీర్ కలిసి నటించిన బ్రహ్మాస్త్ర సినిమా కూడా విడుదలకు రెడీ అవుతోంది.
ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో అజయ్‌దేవగణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతోంది. డివివి దానయ్య ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమో, సాంగ్‌లు ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచేశాయి. వచ్చే ఏడాది జనవరి 7న ఈ సినిమా విడుదల కానుంది.