Akira Nandan: పవన్ కళ్యాణ్ సక్సెస్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్లాలని వారు కలలు కన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో భాగంగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్ సాధించారు. పిఠాపురం నుండి గెలిచి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అలాగే డిప్యూటీ సీఎం అయ్యారు. పాలనలో తలమునకలైన పవన్ కళ్యాణ్ … విరామ సమయాన్ని చిత్రాల షూటింగ్స్ కి కేటాయిస్తున్నారు.
ఓజీ, హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలను ఆయన పూర్తి చేయాల్సి ఉంది. ఓజీ, హరి హర వీరమల్లు సినిమాల షూటింగ్స్ తిరిగి ప్రారంభమయ్యాయి. ఉస్తాద్ భగత్ సింగ్ పై ఎలాంటి అప్డేట్ లేదు. పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తెరకెక్కించిన హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి దర్శకుడిగా ఉన్నారు. కాగా ఇకపై పవన్ కళ్యాణ్ చిత్రాలు చేస్తారనే గ్యారంటీ లేదు. ఆయన కొత్త సినిమాలకు సైన్ చేయరనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఈ క్రమంలో నట వారసుడు అకీరా నందన్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
అకీరా నందన్ పక్కా హీరో మెటీరియల్. చాలా అందగాడు. ఆజానుబాహుడు. అకీరా హీరోగా మారితే మరో పవర్ స్టార్ అవుతాడు అనడంలో సందేహం లేదు. అకీరా ఎంట్రీ పై ఒకటి రెండు సందర్భాల్లో రేణు దేశాయ్ మాట్లాడింది. అకీరా ప్రస్తుతం మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు. ఫిల్మ్ మేకింగ్ కోర్సు కూడా చేశాడని ఆమె చెప్పారు. ఇక నటుడిగా మారేది లేనిది, పూర్తిగా అతని నిర్ణయం అన్నారు. మెగా ఫ్యామిలీ నుండి అకీరా అరంగేట్రం నుండి ఎవరూ స్పందించింది లేదు. అయితే రామ్ చరణ్ అప్డేట్ ఇచ్చాడనేది లేటెస్ట్ న్యూస్.
రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ జనవరి 10న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ అన్ స్టాపబుల్ షోకి హాజరయ్యారట. హోస్ట్ బాలకృష్ణ పలు ఆసక్తికర ప్రశ్నలతో రామ్ చరణ్ నుండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రాబట్టాడని సమాచారం. పనిలో పనిగా అకీరా ఎప్పుడు హీరోగా లాంచ్ అవుతున్నాడని కూడా అడిగాడట. ఈ ప్రశ్నకు రామ్ చరణ్ స్పష్టమైన సమాచారం ఇచ్చాడట. సంక్రాంతికి అన్ స్టాపబుల్ సీజన్ 4 కి సంబంధించిన రామ్ చరణ్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఆ ఎపిసోడ్ ఆహాలో అందుబాటులోకి వచ్చాక అకీరా ఎంట్రీ పై స్పష్టత వస్తుందని సమాచారం.