
దర్శకుడు సురేందర్ రెడ్డి ‘ఏజెంట్’ అంటూ అక్కినేని అఖిల్ తో భారీ కసరత్తులు చేయిస్తున్నాడు. మొదట సిక్స్ ప్యాక్ అన్నాడు. ఆ తర్వాత అంతకు మించి అన్నాడు.దాంతో లాక్ డౌన్ మొత్తం అఖిల్ జిమ్ కే ఎక్కువ టైమ్ కేటాయించాల్సి వచ్చింది. ఎందుకు అఖిల్ ఇంత కష్టపడుతున్నాడు అనుకున్నారు అందరూ. కానీ తన కష్టాన్ని ఒక్క పోస్టర్ లోనే కళ్లకు కట్టినట్లు చూపించాడు అఖిల్.
తాజాగా ఏజెంట్ అనే ఈ స్టైలిష్ స్పై థ్రిల్లర్ నుండి చిత్రబృందం ‘మీరు వైల్డ్ రైడ్ కి అఖిల్ తో సిద్ధమేనా ?’ అంటూ ఒక వైల్డ్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. పోస్టర్ ను చూస్తుంటేనే అఖిల్ లుక్ ఈ సినిమాలో ఎంత వైల్డ్ గా ఉందో అర్ధం చేసుకోవచ్చు. తన నరాలు కూడా ఎముకలు లాగా బలంగా లావుగా కనిపించేంతగా అఖిల్ ఈ సినిమా కోసం బాడీని పెంచాడు.
కండలు తిరిగిన దేహంతో వెనుక వైపు ఉండి ఒళ్ళు విరుచుకుంటూ కనిపిస్తోన్న అఖిల్ మరీ వైల్డ్ గా ఉన్నాడు. మరి అఖిల్ తో ఈ భారీ వైల్డ్ రైడ్ ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికి ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది. అయితే, ఈ సినిమాకి భారీ బడ్జెట్ పెడుతున్నారు. అఖిల్ మార్కెట్ స్థాయి కంటే రెట్టింపు పెట్టుబడి పెడుతున్నారు.
మెగాస్టార్ తో వందల కోట్ల బడ్జెట్ తో సైరా తీసిన సురేందర్ రెడ్డి ఆ సినిమా నిర్మాతకు భారీ నష్టాలను మిగిల్చాడు. మరి ఇప్పుడు అఖిల్ తో కూడా సురేందర్ రెడ్డి భారీ బడ్జెట్ ను పెట్టిస్తున్నాడు. మరి ఈ బడ్జెట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రానున్న డిసెంబర్ 24 కి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.