బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తెలంగాణతోపాటు ఏపీలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల సీజన్ కావడం.. ఈ క్రమంలోనే బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో బలంగా వర్షాలు కురుస్తున్నాయి.
రుతుపవనాల ప్రభావంతో గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈనెల 13వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
తెలంగాణలో అయితే ఈ ఉదయం నుంచి వానలు జోరుగా కురుస్తున్నాయి. హైదరాబాద్ లోని ముషీరాబాద్, సికింద్రబాద్, అడిక్ మెట్, నల్లకుంట, కేపీహెచ్.బీ, నిజాంపేట్, బాచుపల్లి, బాలానగర్, కుత్బుల్లాపూర్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో ఆదివారం జులై 11 ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజామున తేలికపాటి చినుకులు పడగా.. మధ్యాహ్నం సమయానికి భారీ వర్షంగా మారింది.
ఇక తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్, జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లాలో 14.9 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు తెలుస్తోంది. వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 3 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని విపత్తుల శాఖ కమిషనర్ తెలిపారు. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోవర్షాలు కురుస్తాయని తెలిపారు.మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని.. మూడు రోజులు సముద్రంలో అలజడి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. తీరం వెంబడి గంటకు 55 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు.
ఇక తెలుగు రాష్ట్రాలే కాదు.. ఈ అల్ప పీడన ప్రభావంతో కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, గుజరాత్, అండమాన్ నికోబార్ రాష్ట్రాల్లోనూ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.