ఐశ్వర్యా రాజేశ్. మన తెలుగమ్మాయే. ఒకప్పటి తెలుగు నటుడు రాజేశ్ కుమార్తె ఆమె. తమిళ చిత్ర పరిశ్రమ నుంచి తెరంగేట్రం చేసిన ఐశ్వర్య తర్వాత తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ‘కౌసల్య కృష్ణమూర్తి’లో క్రికెటర్గా నటించి ఆకట్టుకున్న ఆమె.. విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘వరల్డ్ ఫేవస్ లవర్’లో సువర్ణ పాత్రలో ఒదిగిపోయింది.ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయినా.. సీనయ్య (విజయ్), సువర్ణ పాత్రలు మాత్రం ప్రేక్షకులను ఫిదా చేశాయి.
తెలుగుతో పాటు తమిళంలో కూడా బిజీగా మారిన ఐశ్వర్య.. చిత్ర పరిశ్రమలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పింది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని, కెరీర్ తొలినాళ్లలో లైగింక వేధింపులకు గురయ్యానని తెలిపింది. తాను కొంచెం నల్లగా ఉండడంతో పరిశ్రమకు చెందిన వాళ్లు హేళన చేశారని చెప్పింది. ‘నువ్వు హీరోయిన్ మెటీరియల్ కాదు. కమెడియన్ పక్కన తప్ప హీరో పక్కన సెట్ అవ్వవు’ అని ఒక దర్శకుడు కించపరిచేలా మాట్లాడాడని తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి ఐశ్వర్య గుర్తు చేసుకుంది. అయితే, ఇలాంటి ఇబ్బందులు ఎన్ని ఎదురైనా తాను ఆగిపోలేదని తెలుగమ్మాయి చెప్పింది. వాటన్నింటినీ దాటి ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపింది.
ఐశ్వర్య సినీ ప్రయాణంలోనే కాదు జీవిత ప్రయాణంలోనూ ఎన్నో అవరోధాలున్నాయి. ఆమె లైఫ్‌లో సినిమా కష్టాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే ఎనిమిదో ఏటనే ఐశ్వర్య తన తండ్రి రాజేశ్‌ను పోగొట్టుకుంది. తండ్రిలోటు లేకుండా తల్లి పెంచింది. కానీ, ఆ తర్వాత రెండేళ్ల వ్యవధిలో ఐశ్వర్య ఇద్దరు అన్నలు మరణించడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో నిలిచింది. ఆ సమయంలో తమ ఫ్యామిలీకి ఎవ్వరూ అండగా లేకపోవడంతో చాలా భయపడ్డానని ఐశ్వర్య తెలిపింది. కుటుంబ పోషణ కోసం సీరియల్స్‌లో నటించానని, కానీ, పారితోషికం చాలా తక్కువగా ఇచ్చేవారని చెప్పింది. తల్లి సలహాతో సినిమా అవకాశాల కోసం వెతికితే వేధింపులు ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపింది. తొలుత చిన్న పాత్రల్లో నటించిన ఐశ్వర్య కెరీర్ ని ‘కాకా ముట్టై’ చిత్రం మలుపు తిప్పంది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో పాటు ఎంతో కష్టపడి మంచి పేరు తెచ్చుకున్న ఐశ్వర్య జీవిత ప్రయాణం స్ఫూర్తిదాయకం.