ఆర్ఎస్ఎస్ సూచనతోనే టిటిడి ఆస్తులపై జగన్ వెనుకడుగు!

ఎందరు వ్యతిరేకించినా, చివరకు కోర్ట్ లు మొట్టికాయలు వేసినా ఒక సారి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి వెనుకడుగు వేయడం తెలియదు. ఈ విషయంలో సొంత పార్టీ వారి అభిప్రాయాలను కూడా ఖాతరు చేయరు. అయితే టిటిడి భూముల వేలంపాట విషయంలో ఆయన వెనుకడుగు వేయడం అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. పైగా ఈ నిర్ణయానికి వ్యతిరేకత ఎదురైనా అంత బలంగా లేదు. సోషల్ మీడియా లోనే […]

Written By: Neelambaram, Updated On : May 26, 2020 1:53 pm
Follow us on


ఎందరు వ్యతిరేకించినా, చివరకు కోర్ట్ లు మొట్టికాయలు వేసినా ఒక సారి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి వెనుకడుగు వేయడం తెలియదు. ఈ విషయంలో సొంత పార్టీ వారి అభిప్రాయాలను కూడా ఖాతరు చేయరు.

అయితే టిటిడి భూముల వేలంపాట విషయంలో ఆయన వెనుకడుగు వేయడం అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. పైగా ఈ నిర్ణయానికి వ్యతిరేకత ఎదురైనా అంత బలంగా లేదు. సోషల్ మీడియా లోనే ఎక్కువగా కనిపించింది. లాక్ డౌన్ కారణంగా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపే పరిస్థితులలో లేవు.

పైగా ఆస్తుల అమ్మకపు నిర్ణయాన్ని సమర్ధవంతంగా సమర్ధించుకోవడంలో జగన్ కు సన్నిహిత బంధువైన టిటిడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ విజయం సాధించారు. గత టిడిపి పాలనలోనే ఆస్తుల అమ్మకపు నిర్ణయం తీసుకున్నారని బలమైన వాదన చేయగలిగారు.

అయితే ఆయన స్వరంలో అకస్మాత్తుగా సోమవారం మార్పు వచ్చింది. ఆబ్బె వేలంవేసే నిర్ణయం తీసుకోలేదని, కేవలం ప్రతిపాదన దశలో మాత్రమే ఉన్నదని చెప్పుకొంటూ వచ్చారు. టిటిడి ఆస్తుల వేలం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ఈ నిర్ణయాన్ని వెనుకకు తీసుకోమని రాజ్యసభ నామినేట్ సభ్యుడైన ప్రముఖ ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతకర్త రాకేష్ సిన్హా కోరగానే ప్రభుత్వ వైఖరిలో మార్పు రావడం గమనార్హం.

టిటిడి ట్రస్ట్ బోర్డు లో ఆయన ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్నారు. అంటే ఆర్ ఎస్ ఎస్ అభ్యంతరం వ్యక్తం చేయడంతోనే జగన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు స్పష్టం అవుతున్నది. బిజెపి నాయకత్వంతో కన్నా ఆర్ ఎస్ ఎస్ నాయకత్వంతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం పట్ల జగన్ చాల ఆసక్తిగా ఉన్నట్లు ఈ అంశం వెల్లడి చేస్తుంది.

2019 ఎన్నికలలో ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు మూకుమ్మడిగా మద్దతు ఇవ్వడంతోనే జగన్ అనూహ్యంగా 151 సీట్లు గెల్చుకున్నారని గమనార్హం. జగన్ క్రైస్తవ సంబంధాల పట్ల ఆర్ ఎస్ ఎస్ లో ఆయనంటే కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పట్ల గల ద్వేష భావన కారణంగా జగన్ ను పూర్తిగా వ్యతిరేకించలేక పోతున్నారు.

అందుకనే జగన్ ఆర్ ఎస్ ఎస్ కు తగు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకు సుబ్బారెడ్డి వారధిగా ఉంటున్నారు. ఆయన కనీసం మూడు సార్లు విజయవాడ లోని ఆర్ ఎస్ ఎస్ కార్యాలయంపై వెళ్లి, ఆ సంస్థ ప్రముఖ నాయకులతో మంతనాలు జరిపారు.

టిటిడి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు సమయంలో బిజెపి నుండి నలుగురికి ప్రాతినిధ్యం ఇవ్వాలని జగన్ భావించారు. అందుకు పేర్లు సూచించమని రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కోరారు. కన్నా వెంటనే పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను సంప్రదించగా ఆయన స్పష్టంగా తిరస్కరించారు. జగన్ ప్రభుత్వంలో తమకు ఎటువంటి నామినేట్ పదవులు ఆశించడం లేదని స్పష్టం చేశారు.

బిజెపి నిరాకరించినా ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంత వేత్త రాకేష్ సిన్హాకు టిటిడి బోర్డు లో జగన్ సభ్యత్వం కల్పించడం గమనిస్తే ఆర్ ఎస్ ఎస్ నాయకత్వం వద్ద ఆయనకు గల పలుకుబడిని వెల్లడి చేస్తుంది.