Farhana Movie Controversy: “దీ కేరళ స్టోరీ”ని మర్చిపోకముందే కోలీవుడ్ లో మరో వివాదం

శుక్రవారం విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన ట్రైలర్ వివాదాలకు కారణమవుతోంది.. ముస్లింల నేపథ్యంలో ఈ సినిమాను నెల్సన్ వెంకటేశన్ రూపొందించారు.

Written By: Bhaskar, Updated On : May 12, 2023 11:20 am
Follow us on

Farhana Movie Controversy: “దీ కేరళ స్టోరీ”.. అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఎన్నో వివాదాలకు కారణమైంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ సినిమాను ప్రదర్శించకుండా అక్కడి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఇక ఈ సినిమా రోజురోజుకు పాలు వివాదాలకు కేంద్ర బిందువు అవుతూనే ఉంది. దీనిని మర్చిపోకముందే తమిళనాడు సినిమా ఇండస్ట్రీలో ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో రూపొందిన ఫర్హాన సినిమా ఇప్పుడు మరో వివాదాన్ని రేకెత్తిస్తోంది. నెల్సన్ వెంకటేషన్ దర్శకత్వంలో ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. శుక్రవారం ఈ సినిమా విడుదల కాబోతోంది.

ట్రైలర్ పై వివాదాలు

శుక్రవారం విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన ట్రైలర్ వివాదాలకు కారణమవుతోంది.. ముస్లింల నేపథ్యంలో ఈ సినిమాను నెల్సన్ వెంకటేశన్ రూపొందించారు. అయితే దీనిపై కొన్ని ముస్లిం సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఫర్హాన సినిమా ట్రైలర్ లో ముస్లిం మహిళలను, హిజాబ్ ను అవమానించేలా మాటలు ఉన్నాయని కొన్ని ఇస్లామిక్ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని సన్నివేశాలు కూడా ఇస్లామిక్ సంస్కృతిని తప్పు పట్టే విధంగా ఉన్నాయని ఆరోపిస్తున్నాయి. వాటిని ఈ సినిమాలో తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి.

నిర్మాతలు ఏమంటున్నారంటే..

ఫర్హాన సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ పై ఇస్లామిక్ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో..ఈ సినిమా నిర్మించిన డ్రీమ్ వారియర్స్ పిక్చర్ సంస్థ సుదీర్ఘ వివరణ ఇచ్చింది.,” మాకు సినిమా తీయడం మాత్రమే వచ్చు. మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు. అలాగని సానుకూలం కాదు. ప్రజల మనోభావాలు మాకు చాలా ముఖ్యం. ఎవరినీ నొప్పించాలనేది మా ఉద్దేశం కాదు. దయచేసి అర్థం చేసుకోండి. మా సంస్థ ఖైదీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను తమిళ చిత్ర పరిశ్రమకు అందించింది.. ఇప్పుడు అదే తరహాలో ఫర్హాన అనే సినిమాను నిర్మించాం. ఈ సినిమా విడుదల కాబోతోంది. మేము తీసే సినిమాల్లో నాణ్యత ఉంటుంది. ప్రజలను ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. అందులో సామాజిక బాధ్యత మిళితమై ఉంటుంది” అని నిర్మాతలు స్పష్టం చేశారు. మరోవైపు సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో తమిళనాడులోని ఆయా థియేటర్ల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.