Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలను అంగీకరిస్తూ ముందుకు పోతున్నాడు. ఈ క్రమంలో రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన కథతో, ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రవితేజ ‘ధమాకా’ సినిమా చేయడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం ఈ నెల 22వ తేదీతో షూటింగ్ పూర్తి చేసుకోబోతుంది. రవితేజ 69వ చిత్రంగా ఈ సినిమా రాబోతుంది.
ఇక ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ అట, ముఖ్యంగా సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ ఫుల్ కామెడీ టైమింగ్ తో అద్భుతంగా ఉంటుందని.. చిరు ‘చంటబ్బాయి’ సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా ఉండబోతుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఎలాగూ త్రినాథరావ్ నక్కిన కూడా మంచి కామెడీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి.. తన గత చిత్రాలు ‘సినిమా చూపిస్తా మామ’ ‘నేను లోకల్’ సినిమాల శైలిలోనే నక్కిన ఈ సినిమాని కూడా మలచబోతున్నాడు.
పైగా రవితేజ కామెడీ టైమింగ్ కి తగ్గట్టు ఈ సినిమా ఉంటుందట. ఏమైనా కేవలం తన మాడ్యులేషన్ తోనే అద్భుతమైన కామెడీని పండించగలడు రవితేజ. మరి రవితేజను కరెక్ట్ గా వాడుకుంటే.. నక్కినకి మరో హిట్ పడినట్టే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ల పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించనున్నారు. వివేక్ కూబిబొట్ట సహా నిర్మాతగా వ్యవహరించనున్నారు.
కార్తిక్ ఘట్టమనేని సంగీతం అందించనున్నారు. క్రాక్ సినిమాతో హిట్ కొట్టిన మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో జోరు మీదున్నాడు. ఇప్పటికే డైరెక్టర్ శరత్ మందవాతో ‘రామారావు ఆన్ డ్యూటీ’అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా రవితేజ నటిస్తున్నాడు.
చిరు హీరోగా యంగ్ డైరెక్టర్ కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రాబోతున్న వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా రవితేజ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. జూలై 18వ తేదీ నుంచి స్టార్ట్ కానున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ లో రవితేజ, చిరంజీవిలపై కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు.