Prabhas: బాహుబలి విజయంతో వరుసగా పాన్ ఇండియా చిత్రాలు తీస్తున్న ప్రభాస్.. షూటింగ్స్‌తో క్షణం తీరిక లేకుండా ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రాధేశ్యామ్, సలార్ చిత్రాల్లో నటిస్తుండగా.. మరోవైపు డార్లింగ్ ప్రధానపాత్రలో దర్శకుడు ఓమ్‌రౌత్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ఆదిపురుష్. పాన్ ఇండియా మూవీ త్రీడీలో తెరకెక్కుతోంది. కరోనా కారణంగా విడుదల తేదీ విషయంలో పలు మార్పులు చోటుచేసుకోగా.. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఓమ్‌రౌత్ తెలిపారు. బాహుబలిలో ఉన్న గ్రాఫిక్స్ కంటే.. మూడు రెట్లు ఎక్కువ వి.ఎఫ్.ఎక్స్. అండ్ గ్రాఫిక్స్ వర్క్స్ ఇందులో ఉండనున్నట్లు సమాచారం.
ఇప్పటికే రావణ పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీఖాన్, సీతగా కనిపించనున్న కృతీ సనన్ వారి షూటింగ్స్ పూర్తి చేసుకొన్నారు. రామాయణం ప్రధానాంశంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో శ్రీరాముడిగా ప్రభాస్ కనిపించనున్నారు. ఓవైపు గ్రాఫిక్స్‌తో పాటు పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్‌ను శరవేగంగా ముగిస్తూ.. అదే సమయంలో ప్రభాస్‌పై తీయాల్సిన సన్నివేశాలను నాన్‌స్టాప్‌గా చిత్రీకరించే పనిలో ఉంది చిత్రబృందం. వచ్చే నెలాఖరులోగా సినిమా పూర్తి చేయాలని ఓమ్‌రౌత్ భావిస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ఆగస్టు 11న సినిమా విడుదల చేయడం ఖాయమని తెలుస్తోంది.
మరోవైపు, ప్రభాస్- పూజ హెగ్డె జంటగా రానున్న చిత్రం రాధేశ్యామ్. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తించింది. 1970ల నాటి వింటేజ్ ప్రేమకథతో ‘రాధేశ్యామ్’ సినిమా తీశారు. జగపతిబాబు, భాగ్యశ్రీ, ప్రియదర్శి, జయరామ్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. దక్షిణాది ప్రేక్షకుల కోసం జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదల స్టిల్స్, పోస్టర్స్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుందీ ‘రాధేశ్యామ్’.