Pavala Syamala: చిత్ర పరిశ్రమలో ఓ మోస్తరు నటుల జీవితాలకు భరోసా ఉండదు. అవకాశాలు రాకపోతే కనీసం తినడానికి తిండి ఉండదు. లేడీ కమెడియన్స్ శ్రీలక్ష్మీ, రమాప్రభ, గీతా సింగ్ ఇలా పలువురు ఆర్థిక బాధల్లో చిక్కుకొని అలమటిస్తున్నారు. వీరి అరాకొరా సంపాదన బ్రతకడానికి సరిపోతుంది. సేవింగ్స్ చేసుకొనే అంత రెమ్యునరేషన్ రాదు. వారి మాదిరే నటి పావలా శ్యామల చాలా కాలంగా తెలుగు పరిశ్రమలో కొనసాగుతున్నారు. వందల చిత్రాల్లో ఆమె నటించారు. ప్రస్తుతం ఆమెకు కనీసం తినడానికి తిండి లేదు. ‘మా’ సభ్యత్వం ఉన్నా ఆదుకునే నాథుడు లేడని వాపోతుంది.

గతంలో పావలా శ్యామల పరిస్థితి గమనించిన చిరంజీవి కుమార్తె వైద్య ఖర్చుల కోసం రూ. 2 లక్ష ఆర్థిక సహాయం చేశారు. అలాగే మరో రూ. 1 లక్ష మా సభ్యత్వం కోసం ఇచ్చారు. అవకాశాలు లేక దీన స్థితిలో ఉన్న పావలా శ్యామలకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుండి ఎలాంటి సహాయం లభించలేదట. మా అధ్యక్షుడు మంచు విష్ణు ఏ విధంగా ఆదుకోలేదంటూ పావలా శ్యామల అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కొన్నాళ్ల క్రితం పావలా శ్యామల ఇంటికి కరాటే కళ్యాణి వెళ్లారు. ఆమె దీన స్థితి గురించి అందరికీ తెలియజేశారు. మానసిక స్థితి సరిగా లేని కూతురుతో పావలా శ్యామల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కరాటే కళ్యాణి తెలియజేశారు. కరాటే కళ్యాణి వీడియో బయటకు రావడంతో పరిశ్రమకు చెందిన కొందరు ఆమెకు సహాయం చేశారు. కనీసం వైద్య ఖర్చులకు, తిండికి డబ్బులు లేక పావలా శ్యామల ఇబ్బందిపడుతున్నారట.

చివరిగా పావలా శ్యామల 2019లో విడుదలైన మత్తు వదలరా మూవీలో నటించారు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన పావలా శ్యామలకు చిన్నప్పటి నుండి కష్టాలే అని తెలుస్తుంది. పసిప్రాయంలోనే శ్యామల తల్లిని కోల్పోయారు. వివాహం జరిగాక కూతురు పుట్టిన తర్వాత భర్త చనిపోయారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా పావలా శ్యామల పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఛాలెంజ్, స్వర్ణ కమలం, కర్తవ్యం వంటి అనేక హిట్ చిత్రాల్లో నటించారు.