
Manchu Manoj and YS Jagan : మంచు హీరో మనోజ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. సాధారణంగా ఇదేం పెద్ద విషయం కాదు. కానీ.. కలిసిన సందర్భమే ఇదో పెద్ద విషయంగా చర్చలోకి వచ్చింది. జగన్ ను కలిసిన తర్వాత మనోజ్ ట్వీట్ చేశారు. రాష్ట్ర భవిష్యత్ కు సంబంధించి ముఖ్యమంత్రి చేసిన ఆశాజనకమైన ప్రణాళికలకు మద్దతు ఇస్తున్నట్టు పేర్కొన్నారు.
‘‘విజన్ కలిగిన ఏపీ సీఎం జగన్ గారిని కలవడం గౌరవంగా భావిస్తున్నాను. రాష్ట్రం కోసం ఆయన చేస్తున్న కొన్ని గొప్ప ఆలోచనల గురించి చర్చించాము. సమీప భవిష్యత్ కోసం ఆయన చేస్తున్న అద్భుతమైన ప్రణాళికలను విన్నాను. అవి అద్భుతంగా, ఆశాజనకంగా ఉన్నాయి. జగన్ సార్… మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి దేవుడు మీకు బలం, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడని ఆశిస్తున్నాను’’ అని ట్వీట్ చేశాడు మనోజ్.
అయితే.. ఈ ట్వీట్ ఇంతగా చర్చనీయాంశం కావడానికి కారణం ఏమంటే.. ముఖ్యమంత్రితో సినీ పెద్దల సమావేశం ఒకటి జరగాల్సి ఉంది. సినిమా ఇండస్ట్రీ మొత్తం పడుతున్న ఇబ్బందులు ఆ సమావేశంలో చర్చించాల్సి ఉంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి సమాచారం కూడా వచ్చింది. మంత్రి పేర్ని నాని చిరంజీవితో ఫోన్లో మాట్లాడి, సీఎంతో మీటింగ్ కు రావాలని ఆహ్వానించారు. దీంతో.. మెగాస్టార్ ఆగమేఘాల మీద ఇండస్ట్రీ పెద్దలతో సమావేశమై, జగన్ తో మాట్లాడాల్సిన ఎజెండాను సిద్ధం చేసుకున్నారు.
ఆ తర్వాత మంత్రి పేర్నినాని హైదరాబాద్ వచ్చి చిరంజీవిని కూడా కలిసి వెళ్లారు. దీంతో.. త్వరలోనే ఇండస్ట్రీ పెద్దల సమావేశం జరగనుందనే చర్చ కొనసాగుతూనే ఉంది. జగన్ తో సమావేశానికి అపాయింట్ మెంట్ లభించలేదని, ముఖ్యమంత్రి బిజీగా ఉన్నారని రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. దీంతో.. ఇప్పటి వరకూ ఆ మీటింగ్ జరిగిందే లేదు.
కానీ.. ఇప్పుడు ఉన్నట్టుండి ఇండస్ట్రీకే చెందిన ఒక నటుడు వెళ్లి జగన్ తో మీటింగ్ జరపడం తీవ్ర చర్చనీయాంశమైంది. సినీ పరిశ్రమ సమస్యలను చర్చించడానికి దొరకని ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్.. ఒక హీరో కలవడానికి ఎలా దొరికింది? అన్నదే ప్రధాన ప్రశ్న.
వకీల్ సాబ్ సినిమా సమయంలో ఉన్నట్టుండి జీవో తెచ్చి టికెట్ రేట్లను తగ్గించింది సర్కారు. ఎప్పుడో పదేళ్లనాటి టికెట్ రేట్లతో థియేటర్లు నడపలేమని, అది కూడా 50 శాతం ఆక్యుపెన్సీతో అసాధ్యమని ఎగ్జిబిటర్లు మూసేశారు. దీంతో.. పెద్ద సినిమాలు ఇప్పటికీ విడుదల కావట్లేదు. ఇంత పెద్ద సమస్య చర్చించడానికి అపాయింట్ మెంట్ కుదరనప్పుడు.. ఒక హీరోతో మాట్లాడడానికి సమయం ఎలా దొరికిందా? అనే చర్చ సాగుతోంది.
అదే సమయంలో.. మా ఎన్నికల హడావిడి కూడా సాగుతోంది. మనోజ్ సోదరుడు విష్ణు అధ్యక్ష రేసులో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రతిగా ప్రకాష్ రాజ్ ఉన్నారు. మిగిలిన ఇద్దరు పోటీదారులను తన గ్రూపులో కలిపేసుకున్నారు. ఇలాంటి సమయంలో మనోజ్ కు ముఖ్యమంత్రి సమయం ఇవ్వడం.. సినీ పెద్దలకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో.. ఏం జరుగుతోంది? అనే చర్చ సాగుతోంది?