Fish Venkat: దయనీయమైన స్థితిలో ‘గబ్బర్ సింగ్’ ఫేమ్ ఫిష్ వెంకట్..పట్టించుకోని సినీ ఇండస్ట్రీ..సహాయం కోసం ఎదురుచూపులు!

ఎన్టీఆర్ 'ఆది' చిత్రం లో తొడగొట్టు చిన్నా డైలాగ్ తో బాగా ఫేమస్ అయ్యాడు. ఆ సినిమాలో ఫిష్ వెంకట్ పాత్రకి మంచి గుర్తింపు రావడంతో వివి వినాయక్ తన ప్రతీ సినిమాలోనూ ఫిష్ వెంకట్ ని తీసుకునేవాడు.

Written By: Gopi, Updated On : September 4, 2024 12:57 pm

Fish Venkat

Follow us on

Fish Venkat: సినీ నటుల జీవితాలు ఒక రంగుల ప్రపంచం లాంటిది. ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు, కెరీర్ మంచి ఊపు మీద ఉన్నంత కాలం రాజభోగాలు ఉంటాయి, విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. కానీ అవకాశాలు తగ్గినప్పుడు మాత్రం కొంతమంది జీవితాలు తలక్రిందులు అవుతాయి. ప్రతీ రంగంలోనూ కష్టాలు సాధారణంగానే ఉంటాయి, వాటి నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు, కానీ సినీ రంగంలో పని చేసే కొంతమంది చిన్న ఆర్టిస్టులకు కష్ట కాలం మొదలైతే జీవితం రోడ్డు మీదకు వచ్చేసినట్టే. ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఫిష్ వెంకట్ పేరు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం కాకపోవచ్చు కానీ, అతని ముఖం చూస్తే గుర్తు పట్టలేని తెలుగు ప్రేక్షకుడు ఉండదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఎన్టీఆర్ ‘ఆది’ చిత్రం లో తొడగొట్టు చిన్నా డైలాగ్ తో బాగా ఫేమస్ అయ్యాడు. ఆ సినిమాలో ఫిష్ వెంకట్ పాత్రకి మంచి గుర్తింపు రావడంతో వివి వినాయక్ తన ప్రతీ సినిమాలోనూ ఫిష్ వెంకట్ ని తీసుకునేవాడు. అలా పాపులారిటీ ని సంపాదించిన ఆయన ‘గబ్బర్ సింగ్’ చిత్రంతో మరింత ఫేమస్ అయ్యాడు. అంత్యాక్షరి సన్నివేశంలో ఇతని పెర్ఫార్మన్స్ ని అంత తేలికగా ఎవ్వరు మర్చిపోలేరు. రీసెంట్ గా రీ రిలీజ్ అయిన ‘గబ్బర్ సింగ్ ‘ చిత్రంలోని అంత్యాక్షరి సన్నివేశంలో ఇతని షాట్ రాగానే థియేటర్ మొత్తం నవ్వులతో, చప్పట్లతో దద్దరిల్లిపోయింది. అలా ‘గబ్బర్ సింగ్’ చిత్రం తర్వాత ఫిష్ వెంకట్ లేని సినిమా లేదంటే ఏమాత్రం అతిశయోక్తి కాదేమో, అలాంటి డిమాండ్ తో కొనసాగేవాడు ఆయన. అయితే ఈమధ్య కాలంలో ఆయన ఎలాంటి సినిమాల్లోనూ కనిపించడం లేదు. పరిస్థితి ఏమిటా అని ఇటీవలే ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన వారు ఫిష్ వెంకట్ ఇంటికి వెళ్లి ఇంటర్వ్యూ చేయగా, అతను ఆ ఛానల్ కి చెప్పుకున్న కష్టాలు చూస్తే కన్నీళ్లు ఆగలేని పరిస్థితి ఏర్పడింది.

ఆయన మాట్లాడుతూ ‘నాకు ఆ మధ్య కాలంలో ఆయాసం బాగా వస్తుండడం వల్ల డాక్టర్ దగ్గరకి వెళ్ళాను. అక్కడ టెస్టులు చేయించుకున్న తర్వాత నాకు డయాలసిస్ చెయ్యాలని చెప్పారు, దాంతో నిమ్స్ ఆసుపత్రిలో చేరి గత ఏడాదిన్నర నుండి డయాలసిస్ చేయించుకుంటున్నాను. అదే సమయంలో నా కాలికి చిన్న గాయం అయ్యింది. నాకు బీపీ, షుగర్ వంటివి కూడా ఒకేసారి రావడంతో నా కాళ్ళు మొత్తం ఇన్ఫెక్షన్ కి గురైంది. డాక్టర్లు ఆపరేషన్ చేసారు కానీ ఇంకా సరి అవ్వలేదు. దీనివల్లనే నాకు ఎన్నో సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ చేయలేకపోయాను. నా రెండు కిడ్నీలు కూడా చెడిపోయాయి. ప్రస్తుతం నా ఇల్లు పూటగడవడానికి కూడా కష్టం గా ఉంది. మెరుగైన వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేకపోవడంతో గాంధీ ఆసుపత్రి లో చికిత్స చేయించుకుంటున్నాను’ అంటూ ఫిష్ వెంకట్ మాట్లాడిన మాటలు ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి. అతని కష్టాలను విని ఏ సినీ సెలబ్రిటీ అయినా స్పందిస్తాడో లేదో చూడాలి.