మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలలో పోటీ రోజురోజుకు పెరుగుతూ ఉంది, మరోపక్క రోజుకొక వ్యక్తి నేను కూడా పోటీలో ఉన్నాను అంటూ ప్రకటిస్తున్నాడు. అసలు ఎప్పుడో సెప్టెంబర్ లో జరగాల్సిన ఎన్నికలకు 3 నెలల ముందే ఇంత హడావుడి అవసరమా ? బరిలో నిలిచిన నటుల మధ్య వాతావరణం ఇప్పటికే వేడెక్కడంతో జనం కూడా ‘మా’ ఎన్నికల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సరే ‘మా’ ఎన్నికల వేడిలో నలిగిపోతున్న నటీనటులను నవ్వించడానికి పెట్టాడో, లేక ప్రేక్షకులకు రిలీఫ్ ఇద్దాం అనుకున్నాడో తెలియదు గాని, మొత్తానికి సీనియర్ నటుడు బ్రహ్మాజీ పెట్టిన పోస్టు అందరినీ ఆకట్టుకుంది. ఇంతకీ బ్రహ్మాజీ పెట్టిన పోస్ట్ ఏమిటో తెలుసా? బ్రహ్మాజీ, చైనా అధ్యక్షుడు జింగ్ పిన్ ను కలిసిన ఫోటో అది. ఫోటోలో మ్యాటర్ ఏమి లేకపోయినా సెటైర్ లా బాగా పేలింది.
ఇక ఈ ఫోటోలో బ్రహ్మాజీకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి జింగ్ పిన్ ప్రయత్నిస్తే, బ్రహ్మజీ మాత్రం నమస్కరిస్తూ కనిపించాడు. పనిలో పనిగా ఈ ఫోటోతో పాటు ఒక మెసేజ్ కూడా పోస్ట్ చేస్తూ.. ‘ఇది సాధారణ మీటింగ్ మాత్రమే. ఎలాంటి రాజకీయాలకు తావులేదు. అయితే ‘మా’ ఎన్నికల గురించి మాత్రం చర్చించాం. ఆయన నాకు కొన్ని టిప్స్ చెప్పారు’ అంటూ కాస్త వ్యంగ్యంతో కూడుకున్న పంచ్ ను విసిరాడు బ్రహ్మజీ.
ఏది ఏమైనా ఇలాంటి పోస్ట్ లు పెట్టి నవ్వించడంలో బ్రహ్మాజీ ఆరితేరిపోయాడు. ఇక ఈ ఫోటో మాత్రం నెటిజన్లను బాగా అలరిస్తోంది. ముఖ్యంగా ఫోటో ఫన్నీగా ఉండటంతో ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. బ్రహ్మజీ చేతిలో దాదాపు ఎనిమిది సినిమాలు ఉన్నాయట. పైగా అన్ని సినిమాల్లో మంచి క్యారెక్టర్సే అంటూ ఈ సీనియర్ నటుడు తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.