ABN Venkata Krishna: వైసిపి అధినేత ఇటీవల ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో.. ఆయన ప్రయాణిస్తున్న వాహనం కింద పడి ఓ అభిమాని తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత దీనికి సంబంధించిన వీడియో బయటికి వచ్చింది. దానిని సహజంగానే కూటమి అనుకూల మీడియా విపరీతంగా నెగిటివ్ ప్రచారం చేయడం మొదలుపెట్టింది. వైసీపీ అనుకూల మీడియా దీనిని ప్రొజెక్ట్ చేసుకునే పనిలో పడింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జగన్ పర్యటిస్తున్నప్పుడు చోటు చేసుకున్న ప్రమాదంపై ఏపీ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే వైసిపి అధినేత ప్రయాణించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక దీనిపై కూటమి అనుకూల మీడియా నిన్న మొత్తం విపరీతమైన నెగిటివ్ ప్రచారం చేసింది. ఇక సాయంత్రం ఏబీఎన్ లో ప్రత్యేకమైన డిబేట్ రన్ అయింది. ఈ డిబేట్ ను వెంకటకృష్ణ నిర్వహించారు..
బోయపాటి, సుకుమార్ కు వెంకటకృష్ణ మాస్ వార్నింగ్
ఇటీవల సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప సినిమాలో “రప్పా రప్పా” అనే డైలాగు ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇటీవల ఉమ్మడి గుంటూరు జిల్లాలో జగన్ పర్యటిస్తున్నప్పుడు వైసీపీ అభిమాని “రప్పా రప్పా” డైలాగ్ ను ప్రస్తావిస్తూ.. ఈసారి అధికారంలోకి వస్తే జరిగేది ఇదే అంటూ అతడు ఫ్ల కార్డులో పేర్కొన్నాడు. దానిని కూటమి అనుకూల మీడియా నెగిటివ్ ప్రచారం చేసింది. అయితే దీనిపై జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించడం విశేషం. అధికారంలోకి వస్తే జరిగేది నిజమే కదా అంటూ వైసీపీ అధినేత క్లారిటీ ఇచ్చారు. ఇక దీనిపై కూటమి అనుకూల మీడియా మరింత రెచ్చిపోయింది. అంతేకాదు మంగళవారం రాత్రి జరిగిన డిబేట్లో ఏబీఎన్ వెంకటకృష్ణ ఏకంగా సినిమా దర్శకులకు అందులో ముఖ్యంగా సుకుమార్, బోయపాటి శ్రీనుకు మాస్ వార్నింగ్ ఇచ్చాడు.. మీలాంటి వాళ్లు సినిమాలు తీయడం వల్లే జగన్ లాంటి వాళ్లు రెచ్చిపోతున్నారని మండిపడ్డాడు.. “సినిమా అనేది బలమైన మాధ్యమమని.. మీరేమో సినిమా తీశామో అనుకుంటున్నారని.. ఇందులో జగన్ లాంటి ఎలిమెంట్ వాటిని తన సొంతానికి వాడుకొని ఇలా ప్రవర్తిస్తున్నాడని” వెంకటకృష్ణ మండిపడ్డాడు. వాస్తవానికి బోయపాటి శ్రీను, సుకుమార్ సినిమాలు మాత్రమే తీశారు. సినిమాలలో కథానాయకుడికి బలమైన నేపథ్యం ఉండడానికి అలాంటి డైలాగులు రాశారు. ఆ డైలాగులు జగన్ చెబుతారని.. ఈ స్థాయిలో అది రచ్చ అవుతుందని ఊహించి ఉండరు కదా. ఈ విషయాన్ని వెంకటకృష్ణ ఎలా మర్చిపోయారో అర్థం కావడం లేదు. ఇక వెంకటకృష్ణ ఆ మాట మాట్లాడిన నేపథ్యంలో వైసీపీ నేతలు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.