Homeఎంటర్టైన్మెంట్Aamir Khan: 'ఫారెస్ట్ గంప్' ను రీమేక్ చేస్తే కంపు అయింది.. అమీర్ ఖాన్ ఇప్పటికీ...

Aamir Khan: ‘ఫారెస్ట్ గంప్’ ను రీమేక్ చేస్తే కంపు అయింది.. అమీర్ ఖాన్ ఇప్పటికీ కోలుకోలేదు

అమీర్ ఖాన్ ఈసారి ఎలాగైనా ఫామ్ లోకి తిరిగి రావాలని భావించి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. హాలీవుడ్ లో విజయం సాధించిన ఫారెస్ట్ గంప్ ఆధారంగా అమీర్ ఖాన్ నిర్మాతగా మారి తన మాజీ మేనేజర్ అద్వైత దర్శకత్వంలో లాల్ సింగ్ చద్దా అనే సినిమాను నిర్మించాడు.

Aamir Khan: తారే జమీన్ పర్, త్రీ ఇడియట్స్, లగాన్, దంగల్, రంగ్ దే బసంతి, ఫనా, పీకే, ధూమ్_3.. ఇలా ఒక్కో సినిమా ఒక్కో బ్లాక్ బస్టర్. భారతీయ చిత్ర పరిశ్రమను ఈ సినిమాలన్నీ దున్నేశాయి. వందల కోట్ల కలెక్షన్లను పట్టేశాయి.. ఈ సినిమాలన్నీ విభిన్నంగా ఉంటాయి. ఇందులో నటించిన ప్రధాన కథానాయకుడు ఏ సినిమాకు ఆ సినిమాకు అన్నట్టుగానే హావ భావాలు పలికించాడు. ఇంతకీ అతడు ఎవరో కాదు అమీర్ ఖాన్. ప్రయోగాలకు పెద్దపీట వేసి అతడు ఈ సినిమాల ద్వారా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించాడు. అలాంటి అమీర్ ఖాన్ ప్రస్తుతం తీవ్ర నిర్వేదంలో ఉన్నాడు.

ముందుగానే చెప్పినట్టు ప్రయోగాలకు పెద్ద పీట వేసే అమీర్ ఖాన్ ను థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ తీవ్రంగా దెబ్బ కొట్టింది. ఆ సినిమాలో పేరుపొందిన నటీనటులు ఉన్నప్పటికీ విజయవంతం కాలేదు. దీంతో అమీర్ ఖాన్ ఈసారి ఎలాగైనా ఫామ్ లోకి తిరిగి రావాలని భావించి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. హాలీవుడ్ లో విజయం సాధించిన ఫారెస్ట్ గంప్ ఆధారంగా అమీర్ ఖాన్ నిర్మాతగా మారి తన మాజీ మేనేజర్ అద్వైత దర్శకత్వంలో లాల్ సింగ్ చద్దా అనే సినిమాను నిర్మించాడు. ఈ సినిమాలో కరీనాకపూర్, తెలుగు అల్లుడు అక్కినేని నాగచైతన్య వంటి వారు నటించారు. ఈ సినిమాను అమీర్ ఖాన్ భారీ బడ్జెట్ తో నిర్మించాడు. నిర్మాణంలో ఉండగానే ఈ సినిమాపై విపరీతమైన నెగెటివిటీ వచ్చింది. అయితే దానిని పోగొట్టేందుకు అమీర్ ఖాన్ నేరుగా రంగంలోకి దిగి దేశవ్యాప్తంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అయినప్పటికీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో తాను పెట్టిన పెట్టుబడి, పడిన కష్టం మొత్తం వృధా కావడంతో అమీర్ ఖాన్ కొద్ది రోజుల వరకు బయటికే రాలేదు. ఆయన కూతురు వివాహానికి వరకు మీడియాలో ఒక్క వార్త కూడా అమీర్ ఖాన్ గురించి రాలేదంటే అతడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

లాల్ సింగ్ చద్దా సినిమా తర్వాత కొంతకాలం పాటు నిరాశలో ఉన్న అమీర్ ఖాన్ కొత్త ప్రాజెక్టుల గురించి ఎటువంటి విషయాలూ బయటకు చెప్పలేదు.. అయితే బాలీవుడ్ వర్గాల ప్రకారం ఈ మధ్య తారే జమీన్ పర్ సీక్వెల్ సితారే జమీన్ పర్ మొదలు పెట్టారని తెలుస్తోంది. అయితే లాల్ సింగ్ చద్దా సినిమా అమీర్ ఖాన్ ను చాలా ఇబ్బంది పెట్టిందని ఆయన మాజీ భార్య కిరణ్ రావు ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. “ఈ సినిమా కోసం మేము చాలా కష్టపడ్డాం. బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకున్నాం. సినిమా విడుదలైన తర్వాత ఫలితం మరో విధంగా వచ్చింది. ఈ సినిమాపై అమీర్ ఖాన్ చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ అవన్నీ అడియాసలు కావడంతో ఆయన నిర్వేదంలో మునిగిపోయారు. ఇది ఒక రకంగా ఆ చిత్ర యూనిట్ కు పెద్ద దెబ్బ.” అని కిరణ్ రావు పేర్కొన్నారు. అమీర్ ఖాన్ తో వైవాహిక జీవితం నుంచి బయటికి వచ్చినప్పటికీ సినిమాల పరంగా సంబంధాలను కిరణ్ రావు కొనసాగిస్తూనే ఉన్నారు.. కిరణ్ రావు దర్శకత్వంలో “లాపతా లేడీస్ ” అనే ఓ సినిమా రూపొందుతోంది. దీనికి అమీర్ ఖాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper