S. S. Rajamouli: సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి చేయబోతున్న పాన్ ఇండియా సినిమా పై మళ్ళీ చాలా కాలం తర్వాత ఇండస్ట్రీలో ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. రాజమౌళి అంటేనే భారీ సినిమా. ఇక మహేష్ సినిమా కూడా భారీగానే ఉంటుంది. మరి ఈ ఇద్దరు కలిసి చేసే సినిమా ఇక ఏ రేంజ్ లో ఉండాలి ? ఇప్పుడు ఇదే ఆలోచిస్తున్నాడు రాజమౌళి. గత ఆరు నెలలుగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విజయేంద్ర ప్రసాద్ తన టీమ్ తో కలిసి మహేష్ – రాజమౌళి సినిమా స్క్రిప్ట్ పై కసరత్తులు చేస్తున్నారు.

అయితే, తాజాగా రాజమౌళి కూడా స్క్రిప్ట్ లో జాయిన్ అయ్యాడు. విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథను ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో రాశారు. ఆ ఫారెస్ట్ లో ఉన్న నిధుల గుట్టల పై ఈ సినిమా సాగుతుంది. అంటే.. ఆ నిధుల కోసం ప్రపంచ సాహస వీరులు అంతా పోటీ పడతారు. ఎవరికీ వారు ఎత్తులకు పై ఎత్తులు వేసి.. ప్రత్యర్థులను చంపుతూ నిధి వేటకు బయలు దేరుతారు. క్లుప్తంగా చెప్పుకుంటే ఈ సినిమా కథ ఇదే.
కాకపోతే.. ఫారెస్ట్ లో జరిగే యాక్షన్ ఎడ్వెంచరెస్ సీన్లు అద్భుతంగా ఉంటాయట. ఎలాగూ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించడంలో రాజమౌళి ని మించినోళ్ళు లేరు. కాబట్టి.. సినిమా ఎలా ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైగా ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యం ఇండియన్ సినిమాకి పూర్తిగా కొత్త నేపథ్యం. ఇంతవరకు భారతీయ సినీ చరిత్రలో ఆ నేపథ్యంలో సినిమా రాలేదు. ఇప్పుడు మహేష్ చేస్తే.. కచ్చితంగా ఇండియా వైడ్ గా ఈ సినిమా పై ఆసక్తి ఉంటుంది.

ఇక రాజమౌళి స్క్రిప్ట్ మొత్తం విని కొన్ని మార్పులు చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించిన ఇంకా రీసెర్చ్ వర్క్ చేయమన్నారట. ఆఫ్రికన్ ఫారెస్ట్ లో ఉండే వింత జంతువుల పై కూడా ప్రత్యేక ఫైట్ సీన్స్ ను రాయమని చెప్పారట. నేషనల్ స్టార్ డైరెక్టర్ గా జక్కన్న ఈ సినిమా విషయంలో ఫుల్ క్లారిటీ గా ఉన్నాడు.
అయితే ఈ ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో ఇంకా క్లారిటీ లేదు. ఎప్పటిలాగే రాజమౌళి ఈ సినిమాని నేషనల్ వైడ్ గా భారీ సినిమాగా ప్లాన్ చేస్తున్నాడు. రాజమౌళి హీరో అంటేనే.. మాస్ కి పరాకాష్ట. అందుకు తగ్గట్టుగానే హీరో లుక్ ను రాజమౌళి డిజైన్ చేస్తాడు. ఈ క్రమంలోనే మహేష్ లుక్ కోసం జక్కన్న ప్రత్యేక కసరత్తులు చేశాడు. గతంలో ఏ సినిమాలో కనిపించని విధంగా మహేష్ ఈ సినిమాలో కనిపిస్తాడట.