12th Fail – Vikrant Massey : : బాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న సినిమాగా ‘12th ఫెయిల్’ పెద్ద విజయాన్ని సాధించిందని చెప్పుకోవచ్చు. విక్రాంత్ మస్సే హీరోగా నటించిన ఈ సినిమా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పెను సంచలనం సృష్టించింది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకోవడంతో పాటు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
అనురాగ్ పాథక్ రచించిన ‘12th ఫెయిల్ ’ అనే నవలను ఆధారంగా తీసుకుని సినీ దర్శకులు విధు వినోద్ చోప్రా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో కథనాయకుడు విక్రాంత్ ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ పాత్రలో జీవించారనే చెప్పాలి. ఎంతగా అంటే ఇటీవల 2024 ఫిల్మ్ ఫేర్ అవార్డులో ఆయన పాత్రకు అవార్డును కూడా అందుకున్నారు.
మొదటిగా బుల్లితెరపై అడుగుపెట్టిన విక్రాంత్ సీరియల్స్ లో తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. నటనలో తనదైన శైలిని కనబరుస్తూ అభిమానులను ఆకట్టుకున్నారు. అంతేకాదు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు వెండితెరపై కథనాయకుడిగా మారిపోయారు. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించారు.
2007లో ధూమ్ మఛావో ధూమ్ సీరియల్ తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన విక్రాంత్ ‘బాలికా వధు’ తో పాపులర్ అయ్యారు. సుమారు ఏడేళ్ల పాటు వరుసగా సీరియల్స్ లో నటించి అభిమానుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆ తరువాత 2013లో సినిమాల్లోకి అరంగేట్రం చేసిన ఆయన హాఫ్ గర్ల్ ఫ్రెండ్, లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా, ఫోరెన్సిక్, గ్యాస్ లైట్, ముంబైకర్, దిల్ దఢ్ ఖనే దో వంటి మూవీల్లో ప్రధాన పాత్రలు పోషించారు.
వెబ్ సిరీస్ లో నటించిన సహా నటి శీతల్ ఠాకూర్ ను విక్రాంత్ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 2019 లో నిశ్చితార్థం జరగగా 2022లో వీరి వివాహం జరిగింది. అంతేకాదు ఆయన మంచి డ్యాన్సర్ కూడా. ప్రముఖ డ్యాన్స్ ట్రైనర్ షైమాక్ దావర్ దగ్గర మోడ్రన్ కాంటెపరరీ, మోడ్రన్ జాబ్ వంటి వాటిలో శిక్షణ తీసుకున్నారు.
12th ఫెయిల్ సినిమాలో నటించిన విక్రాంత్ పై విమర్శకులతో పాటు బాలీవుడ్ అగ్రతారలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో విక్రాంత్ ను ఇర్ఫాన్ ఖాన్ తో పోల్చారు కంగనా రనౌత్. అలాగే విక్రాంత్ నటన చాలా బాగుందంటూ ఆలియా భట్ పోస్ట్ చేశారు. అలాగే హృతిక్ రోషన్, కమల్ హాసన్, అనిల్ కపూర్, కత్రినా కైఫ్, రిషబ్ శెట్టి, దీపికా పదుకొనే, ఫరాన్ అక్తర్ వంటి ప్రముఖులు పోస్ట్ చేయడం విశేషం.