12A Railway Colony Review: నటీనటులు: అల్లరి నరేష్, కామాక్షి భాస్కర్ల, సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, అనీష్ కురువిల్లా తదితరులు.
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఛాయాగ్రహణం: కుషేందర్ రమేష్ రెడ్డి
కథ,స్క్రీన్ ప్లే, డైలాగ్స్: అనిల్ విశ్వనాథ్
దర్శకత్వం: నాని కాసరగడ్డ
నిర్మాతలు: శ్రీనివాస చిట్టూరి
ఓ పదేళ్ళ క్రితం కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన హీరో అల్లరి నరేష్. కానీ గత కొంతకాలంగా తన పంథా మార్చి ‘నాంది’, ‘మారేడుమిల్లి ప్రజానీకం’, ‘ఉగ్రం’, ‘బచ్చల మల్లి’ లాంటి సీరియస్ సినిమాలు ఎక్కువగా చేస్తూ చాట్ జీపీటీ తరం ప్రేక్షకులను కూడా మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. అలా అని పూర్తిగా కామెడీ మానేయకుండా మధ్యలో ‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటూ ఒక సరదా చిత్రంతో కూడా ప్రేక్షకులను పలకరించాడు. తాజాగా ’12 A రైల్వే కాలనీ’ అంటూ మరోసారి సీరియస్ కథతో మన ముందుకొచ్చాడు. మరి ఈ సినిమాలో ఉన్న సస్పెన్స్, థ్రిల్ ప్రేక్షకులను మెప్పించాయా లేదా అనేది మనం రివ్యూలో చూద్దాం.
వరంగల్ యువకుడైన కార్తీక్(అల్లరి నరేష్) ఒక అనాథ. అదే వరంగల్ లో టిల్లు(జీవన్ కుమార్) అనే రాజకీయ నాయకుడు ఈ సారి ఎమ్మెల్యే గా గెలవాలని తన వంతు ప్రయత్నాలు చేస్తుంటాడు. స్నేహితులతో అల్లరి చిల్లరగా తిరిగే కార్తీక్ రాజకీయ నాయకుడైన టిల్లుకి అప్పుడప్పుడు కొన్ని పనులు చేసిపెడుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే కార్తీక్ ఉండే వీధిలోకి ఆరాధన(కామాక్షి భాస్కర్ల) తన తల్లితో పాటు కొత్తగా వస్తుంది. ఆరాధనను చూడగానే కార్తీక్ ఆరాధించడం మొదలుపెడతాడు. తనకు బ్యాడ్మింటన్ అంటే ఇష్టమనే సంగతి గ్రహించి, బ్యాడ్మింటన్లో తన గోల్ రీచ్ అవడానికి అవసరసమైన 3 లక్షల రూపాయలు సర్దుబాటు చేయాలని అనుకుంటాడు.
డబ్బు కోసం తనకు పరిచయం ఉన్న టిల్లు ఇంటికి వెళ్తే అక్కడ ఆయన ఎమ్మెల్యేగా గెలవడానికి క్షుద్ర పూజలు చేయిస్తూ ఉంటాడు. అదే సమయంలో కార్తీక్ మూడు లక్షల రూపాయలు అడుగుతాడు. అతను కార్తీక్ కు డబ్బు ఇస్తానని మాటిస్తూ తనకోసం ఒక పని చేయమంటాడు. కార్తీక్ చేతిలో ఒక పార్సిల్ పెట్టి దాన్ని ఆరాధన ఇంట్లో దాచాలని అంటాడు. పార్సిల్ తీసుకుని ఆరాధన ఇంటికి వెళ్తే ఇల్లు తాళం వేసి ఉంటుంది. సరేలే అనుకుని రాత్రి పూట రహస్యంగా ఇంట్లోకి వెళతాడు. అక్కడ కార్తీక్ కు షాక్ అనిపించే విషయాలు తెలుస్తాయి. హీరోగారికి తెలిసిన సంచలన విషయాలు ఏంటి? అసలు హీరోయిన్ ఎవరు? ఏ ఫలితం ఆశించి రాజకీయనాయకుడు క్షుద్రపూజలు చేస్తున్నాడు? అనే క్లిష్ట ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాలి.
ఈ సినిమా ప్రధానంగా డబల్ మర్డర్ చుట్టూ తిరుగుతుంది. ఒకవైపు పోలీసులు ఆ జంటహత్యలను చేధించడానికి ప్రయత్నిస్తూ ఉండడం, మరోవైపు హీరోగారు తన తాగుబోతు ఫ్రెండ్స్ బ్యాచ్ తో ఆ మిస్టరీని సాల్వ్ చేయడానికి ప్రయత్నించడం, ఈ రెంటికీ తోడు హారర్ టచ్ ఇవ్వడం.. ఇది అసలు కథ. ఒక సినిమాలో ప్రధాన పాత్రలు ప్రేక్షకులకు కనెక్ట్ అయితే కానీ చివరి వరకూ ఆ పాత్రలతో ట్రావెల్ చెయ్యలేరు. ఈ సినిమాలో ఆ ఎమోషనల్ కనెక్ట్ పూర్తిగా మిస్ అయింది. లవ్ స్టోరీ ఉందా.. లేదా అని చెప్పాలంటే ఎవరైనా బుర్ర గోక్కోవాల్సిందే. మెయిన్ పాయింట్ రివీల్ చేయడం భావ్యం కాదు కాబట్టి కొన్ని చెప్పలేకపోతున్నాం కానీ దర్శకుడు ప్రేక్షకులకు ట్విస్టులు ఇస్తున్నాననే ఆలోచనతో తికమక పెట్టడంలో మాత్రం ఘన విజయం సాధించాడు. ఈ కంగాళీకి తోడుగా బూతుల మోత మోగించారు. హీరోయిన్ వాలీబాల్ మ్యాచ్ ఆడుతూ ఉన్నపుడు “పెద్ద బాల్ మీద ఫోకస్ పెట్టు”, దీన్ని ఎవడు చేసుకుంటాడో కానీ వాడికి రోజూ వాలీబాల్ మ్యాచే” లాంటి డైలాగులు అసలు సినిమా మీద ఎలాంటి అభిప్రాయం కలిగిస్తాయో మీరే ఆలోచించుకోవచ్చు. బోల్డ్ కు బూతుకు మధ్య ఓ సన్నని గీత ఉంటుంది. ఇది మాత్రం పూర్తిస్థాయి బూతే.
రైల్వేకాలనీలో కథకు తగ్గట్టు భీమ్స్ నేపథ్య సంగీతం అందించాడు కానీ పాటలు మాత్రం సినిమా కథకు అడుగడుగునా అడ్డం పడ్డాయి. ఇలాంటి సినిమాలకు పాటలు అవసరం లేదనేది అందరికీ తెలిసిందే. అయినా సరే పెట్టారు అనుకున్నా అవీ పెద్దగా ఆకట్టుకోలేదు. డైలాగులు చాలా వీక్ గా ఉన్నాయి. రమేష్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు తగ్గట్టుగా ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి.
నరేష్ తన పాత్రకు తగ్గట్టు చక్కగా నటించాడు కానీ వల్గర్ డైలాగులు మాత్రం అతనికి సూట్ కాలేదు. హీరోయిన్ కామాక్షి లుక్ పెద్దగా ఆకట్టుకోదు. హీరోయిన్ పాత్రకు సంబంధించిన రైటింగ్ వీక్ గా ఉండడంతో తన ఎమోషన్ తో ప్రేక్షకులు కనెక్ట్ కాలేరు. హీరో స్నేహితులుగా నటించిన హర్ష చెముడు, గెటప్ శీను పాత్రలు ఫరవాలేదు. సాయికుమార్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అంత ఇంపాక్ట్ చూపించలేదు.
– సినిమాలో బాగోలేనివి ఇవీ..
1. కాన్ ఫ్లిక్ట్ పాయింట్ కోసమే ఇంటర్వెల్ వరకూ సాగదీయడం
2. స్క్రీన్ ప్లే
3. ఎడిటింగ్
-ఇందులో ఏం బాగున్నాయో తెలుసా?
1. నేపథ్య సంగీతం
ఫైనల్ వర్డ్: కంగాళీ కాలని
రేటింగ్: 1. 5/5