
తెలుగు సినీ పరిశ్రమలో తొలి వారసత్వ నటుడు హరికృష్ణ. 11 సంవత్సరాల వయసులో ‘శ్రీకృష్ణావతారం’ అనే చిత్రంలో చిన్ని కృష్ణుడి పాత్రద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన హరికృష్ణ.. ఆ తర్వాత ‘తల్లా పెళ్లామా?’, ‘తాతమ్మ కల’, రామ్ రహీమ్ ‘దాన వీర శూర కర్ణ’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే.. ఇవన్నీ తండ్రి ఎన్టీఆర్ చిత్రాలే కావడం విశేషం. దాదాపు రెండు దశాబ్దాలపాటు సినీరంగానికి దూరంగా ఉన్న హరికృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో దుమ్ములేపారు. మరపురాని పాత్రలు పోషించారు. అవేంటన్నది చూద్దాం.
అర్జునుడుః ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఎవర్ గ్రీన్ మూవీ దానవీర శూరకర్ణలో హరికృష్ణ నటించారు. అర్జునుడి పాత్రలో ఒదిగిపోయిన ఆయన.. అద్భుతంగా నటించారు. హరికృష్ణ కెరీర్లో ఈ పాత్ర ఎప్పటికీ మరిచిపోలేనిది.

కామ్రేడ్ సత్యంః మోహన్ బాబు హీరోగా.. పరిటాల శ్రీరాములయ్య జీవిత కథతో తెరకెక్కిన చిత్రం శ్రీరాములయ్య. ఈ సినిమాలో హరికృష్ణ కీలక పాత్రలో నటించారు. గిరిజనుల బతుకుల బాగుకోసం తన జీవితాన్ని త్యాగం చేసే నక్సలైట్ సత్యం పాత్రను అద్భుతంగా పోషించారు హరికృష్ణ. ఈ సినిమాలో హరికృష్ణ మీద షూట్ చేసిన ‘‘నీకిస్త తమ్ముడా..’’ పాట ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే.

సీతారామరాజు: వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన సీతారామరాజు చిత్రంలో.. నాగార్జునతో కలిసి నటించారు హరికృష్ణ. ఇందులో నాగార్జున అన్న సీతయ్యగా నటించిన తీరు అమోఘం. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

కృష్ణమ నాయుడుః ఈ చిత్రాన్ని కూడా వైవీఎస్ చౌదరి డైరెక్ట్ చేశాడు. సినిమాలో ఇంటి పెద్ద కొడుకు కృష్ణమనాయుడు పాత్రలో హరికృష్ణ పలికించిన రాజసం.. సినిమాకే హైలెట్. ఆయన కెరీర్లో ఈ పాత్ర ముందు వరసలో నిలుస్తుంది. డైలాగ్ గర్జనతో షేక్ చేశారు హరికృష్ణ.

సీతయ్యః సీతారామరాజు చిత్రంలోని సీతయ్య పాత్ర పేరుతోనే మరో సినిమా తెరకెక్కించారు వైవీఎస్ చౌదరి. ఈ చిత్రంలో హ్యాట్రిక్ విజయం అందుకున్నారు. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సీతయ్యగా హరికృష్ణ అదరగొట్టారు. ‘‘సీతయ్య.. ఎవ్వరి మాటా వినడు’’ అనే డైలాగ్ ఎంతో పాపులర్ అయ్యింది. ఇప్పటికీ.. ఎవరో ఒకరి నోట వినిపిస్తూనే ఉంటుంది.

టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ః ఇదే పేరుతో సినిమా రూపొందింది. రైతుల పక్షాన నిలబడే నాయకుడిగా ఈ చిత్రంలో నటించారు హరికృష్ణ. టైగర్ హరిశ్చంద్రప్రసాద్ గా ఈ సినిమాలో మరోసారి సింహగర్జన చేశారు హరికృష్ణ. ఇది కూడా ఆయన కెరీర్లో మరిచిపోలేని పాత్రగా నిలిచిపోయింది.

ఆనంద భూపతిః శివరామరాజు చిత్రంలో హరికృష్ణ పోషించిన పాత్ర ఆనంద భూపతి. ఈ సినిమాలో ముగ్గురు కుమారుల తండ్రిగా నటించారు. మాట తప్పని మనిషిగా.. ఊరందరి ముందు తల నరుక్కుంటాడు ఆనందభూపతి. ఈ సినిమాలో ఉన్నది కొద్దిసేపే అయినా.. ఈ పాత్ర ఎంతో పేరు తెచ్చింది.
