
‘నర్తనశాల’ సినిమాతో పరాజయంపాలైన కూడా యంగ్ హీరో నాగశౌర్య మాత్రం వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఒక వైపున ఇతర బ్యానర్లలో సినిమాలు చేస్తూనే, మరో వైపున తన సొంత బ్యానర్లోను నాగశౌర్య సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన బ్యానర్ లో ‘అశ్వథ్థామ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 31వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ కాగా.. టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
కాగా ఈ సినిమాలో నాగశౌర్య జోడీగా మెహ్రీన్ కనిపించనుంది. రమణ తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నాడు. ఐరా క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అన్యాయాన్ని ప్రశ్నించే డైనమిక్ హీరోగా ఈ సినిమాలో నాగశౌర్య కనిపించనున్నాడు.
కాగా ‘ఛలో’ తరవాత నాగశౌర్య ఆ స్థాయి హిట్ అందుకోలేదు. ఆయన హీరోగా 2018లో వచ్చిన ‘కణం’, ‘అమ్మమ్మగారి ఇల్లు’, ‘నర్తనశాల’ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. కిందటేడాది వచ్చిన ‘ఓ బేబీ’ హిట్టయినా అందులో నాగశౌర్య పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. దీంతో ప్రస్తుతం నాగశౌర్య ఆశలన్నీ ‘అశ్వథ్థామ’ మీదే ఉన్నాయి. చూద్దాం మరి ఈ సినిమా అయినా కలిసొస్తుందేమో.
