Lok Sabha Election 2024: భారత జనాభా 140 కోట్లకు చేరింది. ప్రపంచంలోనే ఎక్కువ జనాభా ఉన్న దేశంగా గుర్తింపు పొందింది. ఇక ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కూడా మనదే. ఇక జనాభా అత్యధికంగా ఉన్న యువ భారత్‌కు కొదువలేదు. మొత్తం జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్లలోపు వారే. సగటు వయసు 29 కన్నా తక్కువగా ఉంది. అందుకే భారత్‌ను యువ దేశం అని పిలుస్తారు. దేశం యువతది.. కానీ పాలకులు మాత్రం వృద్ధులు. 20 ఏళ్లుగా ఎన్నికైన ఎంపీల వయసు పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది.
17సార్లు లోక్‌సభ ఎన్నికలు..
స్వతంత్ర భారత దేశంలో ఇప్పటి వరు 17 లోక్‌సభలు పూర్తయ్యాయి. అంటే 17సార్లు లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం 18వ లోక్‌సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. 1999లో 13వ లోక్‌సభ నుంచి 2019లో జరిగిన 19వ లోక్‌సభ వరకూ ఎంపికైన ఎంపీల సగటు వయసు 50 ఏళ్లు దాటింది. 2014, 2019 ఎన్నికల్లో ఎంపీలు అయిన వారిలో సగటు వయసు ఏకంగా 55 ఏళ్లు దాటింది.
అర్హత 25 ఏళ్లే..
భారత దేశంలో ఎంపీగా పోటీ చేయడానికి అర్హత వయసును రాజ్యాంగం 25 ఏళ్లుగా నిర్ధారించింది. అయినా ఎన్నిక అవుతున్న వారు మాత్రం 50 ఏళ్లుదాటిన వారే కావడం గమనార్హం. వయసు మళ్లినవారు ఎక్కువవుతున్న కొద్దీ.. యువ ఎంపీల ప్రాధాన్యం తగ్గుతోంది. 17వ లోక్‌సభకు ఎన్నికైన అత్యంత పెద్ద వయస్కుడైన ఎంపీ షఫీకర్ రెహ్మన్ బార్క్. ఈయన ఉత్తర ప్రదేశ్‌లోని సంభాల్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఇక ఈ లోక్‌సభలో అత్యంత పిన్న వయస్కురాలు అయిన ఎంపీ చంద్రాని ముర్ము. ఒడిశాలోని కియోంజార్ స్థానం నుంచి గెలిచారు.
జనాభాలో యువత ఇలా..
2011 జనాభా లెక్కల ప్రకారం.. భారతీయ జనాభాలో 11 శాతం మంది 25–30 ఏల్ల మధ్యవారే. 2019 లోక్‌సభలో ఈ వయసు వారు కేవలం 1.5 శాతం మంది కూడా లేదు. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం.. 25 శాతం కంటే ఎక్కువ మంది 25–40 మధ్య వయసు వారే ఉన్నారు. అయితే ఈ వయసు వారు 17వ లోక్‌సభలో కేవలం 12 శాతం మాత్రమే ఉన్నారు.
ఈ సారైనా ప్రాధాన్యం దక్కేనా..
ఇక ప్రస్తుతం 18వ లోక్‌సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ఈసారైనా యువతకు అంటే 25–40 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి ఎక్కువ ప్రాధాన్యం దక్కుతుందో లేదో చూడాలి. ఎందుకంటే.. అన్ని పార్టీల్లో సీనియారిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో యువ నేతలకు టిక్కెట్లు రావడం లేదు. ఫలితంగా ప్రజలు కూడా పార్టీల ప్రాతిపధికన నేతలను ఎన్నుకుంటున్నారు. మరి ఈసారైనా యువత ప్రాతినిధ్యం పెరగాలని కోరుకుందాం.