UGC Update: ఒక డిగ్రీ పూర్తి చేయడానికే ముక్కీ ములుగుతున్నారు ఈ తరం విద్యార్థులు.. మార్చిలో ఒక సబ్జెక్ట్ పాస్ అయ్యి మళ్లీ సెప్టెంబర్ లో సప్లిమెంటరీ రాస్తూ మూడేళ్లలో కావాల్సిన డిగ్రీని ఐదేళ్ల వరకు సాగతీస్తున్నారు. అయితే మొద్దు అబ్బాయిలే కాదు.. కొంత మంది బుద్దిమంతులు ఉంటారు. పుస్తకాల పురుగులు చదువులను ఇష్టంగా భావించి డిగ్రీలు, పీజీలు పూర్తి చేస్తారు.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) విద్యార్థులకు తాజాగా బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఒకేసారి రెండు డిగ్రీల విధానానికి త్వరలోనే అనుమతి లభించనున్నట్లు ప్రకటించింది. ఒకేసారి రెండు డిగ్రీలు చేసేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అంగీకారం తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి గైడ్ లైన్స్ ను త్వరలో విడుదల చేయనున్నట్లు యూజీసీ చైర్మన్ తెలిపారు.
దీని ప్రకారం.. కొత్తగా ప్రకటించిన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)లో భాగంగా విద్యార్థులు ఒకేసారి రెండు డిగ్రీలు చేసే వీలుంది. దీనివల్ల విద్యార్థులు అనేక స్కిల్స్ పెంచుకుంటారు. ఒకే యూనివర్సిటీ నుంచి ఒకేసారి రెండు డిగ్రీలు పొందవచ్చు. లేదా వేరువేరు యూనివర్సిటీల నుంచి కూడా రెండు డిగ్రీలు చేయవచ్చు.
విద్యార్థులు నేరుగా కాలేజీలకు వెళ్లి చదువుకోవచ్చు. ఆన్ లైన్ లోనూ విద్యార్థులు ఈ చదువులు చదివేందుకు వీలుంది. ఇక ఫిజికల్ మోడ్ తోపాటు ఆన్ లైన్ లో కూడా రెండు డిగ్రీలు చదివే వీలుంది. ఒక్క డిగ్రీయే ఆపసోపాలు పడే విద్యార్థులున్న ఈ రోజుల్లో యూజీసీ ఏకంగా రెండు డిగ్రీలు ఒకేసారి చేయడానికి అవకాశం ఇవ్వడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.