https://oktelugu.com/

TS TET 2024: దరఖాస్తుకు నేడే ఆఖరు.. ఈసారి టెట్ దరఖాస్తులు ఎన్ని? డీఎస్సీకి పోటీ ఎంత?

గతేడాది నిర్వహించిన టెట్‌కు తెలంగాణలో 3 లక్షలకుపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఏప్రిల్‌ 10 నాటికి కేవలం 1.90 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 20, 2024 / 01:05 PM IST

    TS TET 2024

    Follow us on

    TS TET 2024: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టీఎస్‌ టెట్‌) దరఖాస్తుల గడువు నేటితో (ఏప్రిల్‌ 20) ముగియనుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 10తోనే గడువు ముగియాల్సి ఉంది. అయితే దరఖాస్తులు చాలా తక్కువగా రావడం, గడువు పెంచాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు రావడంతో విద్యాశాఖ పది రోజులు(ఏప్రిల్‌ 20 వరకు) గడువు పొడిగించింది.

    దరఖాస్తులు తక్కువ…
    గతేడాది నిర్వహించిన టెట్‌కు తెలంగాణలో 3 లక్షలకుపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఏప్రిల్‌ 10 నాటికి కేవలం 1.90 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దీంతో ప్రభుత్వం గడువు పెంచింది. ఈసారి డీఎస్సీ రాసే వారితోపాటు ఉపాధ్యాయుల ప్రమోషన్‌ కోసం చూస్తున్నవారు కూడా టెట్‌ రాస్తారని ప్రభుత్వం భావించింది. దీంతో దరఖాస్తులు భారీగా వస్తాయని అంచనా వేసింది. కానీ, గతంతో పోలిస్తే ఈసారి తగ్గాయి. ఏప్రిల్‌ 20 వ తేదీ వరకు 2.20 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చినట్లు సమాచారం. మరోమారు గడువు పెంచే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.

    ఫీజు పెంపు ప్రభావం..
    టెట్‌ ఫీజు గతంలో రూ.300 మాత్రమే ఉండేది. ఈసారి ఆ ఫీజులు ఏకంగా రూ.1000కి పెంచారు. దీంతో ఇప్పటికే అర్హత సాధించిన అభ్యర్థులు ఈసారి దరఖాస్తు చేయడానికి ఆసక్తి చూపలేదు. మరోవైపు డీఎస్సీ నోటిఫికేషన్‌ వచ్చినందున చాలా మంది దానిపైనే దృష్టి పెట్టారు. టెట్‌ను పట్టించుకోవడం లేదు.

    ఆసక్తి చూపని ఉపాధ్యాయులు..
    ఇక ఉపాధ్యాయులు దరఖాస్తు చేస్తారని భావించినా పెద్దగా ఆసక్తి చూపలేదు. ప్రమోషన్లకు టెట్‌ తప్పనిసరి అయిన నేపథ్యంలో తమకు ప్రత్యేకంగా టెట్‌ నిర్వహించాలని ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తున్నారు. ఎప్పుడో చదివిన చదువులతో ఇప్పుడు పరీక్ష రాయలేమని పరోక్షంగా అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత అభ్యర్థులతో పోటీ పడలేమని చెప్పకనే చెబుతున్నారు.

    వెబ్‌సైట్‌లో ఎడిట్‌ ఆప్షన్‌..
    ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు దరఖాస్తు సవరణకు విద్యాశాఖ అవకాశం కల్పించింది. దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం వెబ్‌సైట్‌లో ఎడిట్‌ ఆప్షన్‌ తీసుకువచ్చినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఎడిట్‌ ఆప్షన్‌ గడువు కూడా 20వ తేదీతో ముగుస్తుందని పేర్కొన్నారు. ఒకసారి ఎడిట్‌ చేసి సబ్మిట్‌ చేసిన తర్వాత మరోసారి ఎడిట్‌ చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు.

    డీఎస్పీకి పోటీ..
    టెట్‌కు దరఖాస్తులు తక్కువగా వచ్చినప్పటికీ డీఎస్సీకీ పోటీ ఎక్కువగానే ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ సమయంలోనే 3 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. తాజాగా రివైజ్‌ నోటిఫికేషన్‌ ఇవ్వడంతో మరో 2 లక్షల దరఖాస్తులు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. చాలా మంది ఇప్పటికే టెట్‌లో అర్హత సాధించి ఉన్నందున టెట్‌కు దరఖాస్తు చేసుకోలేదని చెబుతున్నారు.