కరోనా విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల వల్ల ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూళ్లు ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. విద్యాశాఖ అధికారుల నుంచి తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు వచ్చే ఏడాది మే నెలలో పరీక్షలు జరగనున్నాయి. ప్రతి సంవత్సరం మార్చి నెల చివరి వారం నుంచి ఏప్రిల్ నెల మొదటివారం వరకు పదో తరగతి పరీక్షలు జరిగేవి.
కరోనా విజృంభణ వల్ల పని దినాలు తగ్గడంతో పదో తరగతి పరీక్షలు ఆలస్యంగా జరగనున్నాయి. అయితే పదో తరగతి పరీక్షల్లో ఎన్ని పేపర్లు ఉంటాయో తెలియాల్సి ఉంది. అధికారులు పేపర్లకు సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడిస్తున్నారు. పదో తరగతి, తొమ్మిదో తరగతి విద్యార్థులకు జనవరి నెల 6,7,8 తేదీలలో ఫార్మేటివ్ పరీక్షలు జరగనున్నాయి. సంక్రాంతి పండుగ సెలవుల తరువాత 7,8 తరగతుల విద్యార్థులకు ఫార్మేటివ్ పరీక్షలు జరగనున్నాయి.
విద్యాశాఖ పనిదినాలు తగ్గడంతో సిలబస్ ను కూడా తగ్గించిన సంగతి తెలిసిందే. పదో తరగతి పరీక్షలు మే నెలలో జరగనుండటంతో ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ నెల చివరి వారం లేదా మే నెల మొదటివారం జరిగే అవకాశాలు ఉన్నాయి. వచ్చే నెలలో విద్యాశాఖ నుంచి పది, ఇంటర్ పరీక్షలకు సంబంధించి తేదీలతో సహా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ సర్కార్ కూడా మే నెలలోనే పదో తరగతి పరీక్షలు నిర్వహించనుందని తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ చివరి వారం నుంచి ప్రారంభం కానున్నాయని సమాచారం. ఇంటర్ పరీక్షలు పూర్తైన రెండు వారాల గ్యాప్ ఇచ్చి తెలంగాణ సర్కార్ ఎంసెట్ పరీక్షలను నిర్వహనించనుందని తెలుస్తోంది.