Vizianagaram: ప్రభుత్వ కొలువు అంటేనే కష్టమైన రోజులు ఇవి. అహోరాత్రులు శ్రమిస్తే గానీ దొరకవు. అటువంటిది ఇష్టమైన ఉద్యోగం కోసం.. ఏడు ప్రభుత్వ కొలువులను వదులుకున్నాడు ఆ యువకుడు. ఎనిమిదో కొలువుగా తనకు ఇష్టమైన ఉద్యోగం దక్కడంతో ఉపశమనం పొందాడు. ఆ ఉద్యోగంలో చేరేందుకు సిద్ధపడుతున్నాడు విజయనగరం జిల్లా గరివిడి మండలం ఏనుగు వలస కు చెందిన వెంపడాపు ఈశ్వరరావు.
నిరుపేద కుటుంబానికి చెందిన ఈశ్వరరావుకు ఎస్సై అవ్వాలని చిరకాల వాంఛ. సామాన్య రైతు కుటుంబానికి చెందిన ఆయన ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఆయన కృషికి తగ్గట్టే వరుస ఉద్యోగాలకు ఎంపిక అవుతూ వస్తున్నాడు. అయితే తనకు ఇష్టమైన ఎస్సై కొలువు కోసం ఏడు ఉద్యోగాలు వదిలేశాడు. ఎనిమిదో ఉద్యోగంగా ఇటీవల ఎస్ఐ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించాడు. ఆనందంతో ఎగిరి గంతేశాడు. ఈశ్వరరావు ది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు.
ఈశ్వరరావు తొలిసారిగా ఎస్ఎస్సి ఎంటిఎస్ ఉద్యోగం సాధించాడు. అనంతరం రైల్వేలో గ్రౌండ్ పాయింట్ మెన్, సివిల్ కానిస్టేబుల్, సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్, శానిటరీ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, రైల్వే పాయింట్, ట్రైన్ మేనేజర్ పోస్టులు సాధించాడు. కానీ తనకు ఇష్టమైన ఎస్సై పోస్ట్ కోసం ఆ కొలువులన్నీ వదులుకున్నాడు. ఎస్సై పరీక్షకు సిద్ధపడ్డాడు. అహోరాత్రులు శ్రమించి తాను అనుకున్నది సాధించుకున్నాడు. ఆ యువకుడి ప్రయత్నాన్ని గ్రామస్తులు, గ్రామ పెద్దలు, స్నేహితులు అభినందిస్తున్నారు.