https://oktelugu.com/

Employees Benefits Telangana – AP : తెలంగాణలో నెత్తిన పెట్టుకొని.. ఏపీలో వేధిస్తున్నారు

పక్కన దాయాది రాష్ట్రం ఉద్యోగులకు పెద్దపీట వేస్తుండగా.. ఇక్కడ మాత్రం ఉన్న బెన్ఫిట్స్ ను నిలిపివేస్తున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : May 1, 2023 / 10:44 AM IST
    Follow us on

    Employees Benefits Telangana – AP : సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగమంటేనే ఒక క్రేజ్. ప్రభుత్వ కొలువు దక్కాలంటే అదృష్టం చేసి ఉండాలంటారు. చేసేది అవుట్ సోర్సింగ్ ఉద్యోగమైన దర్జా వెలగబెడుతుంటారు. సమాజంలో ప్రత్యేకమైన గౌరవం దక్కించుకుంటారు. చివరకు పిల్లనిచ్చే వారు సైతం వెనుక ఉన్న ఆస్తిపాస్తులు, కుటుంబ స్థితిగతులు చూడడం లేదు. చేతిలో ప్రభుత్వ ఉద్యోగమంటే అడిగినంత కట్నంతో తమ పిల్లను కట్టబెడుతున్నారు. అయితే ప్రస్తుతం ఏపీ సమాజంలో మాత్రం ఆ సీన్ లేదు. ప్రభుత్వ ఉద్యోగమంటే వేళకు జీతం రాదు.. ఎప్పుడు వస్తుందో తెలియదు.. ఏడాదికేడాది ఇంక్రిమెంట్ ఉండదు.. వేతన బకాయిలు ఇవ్వరు.. డీఏలు లేవు అన్న అభిప్రాయం సర్వత్రా వ్యాపించింది. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత ఇటువంటి జాఢ్యం పెరిగింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆట వస్తువుగా మారిపోయారు.

    గత ఎన్నికల్లో ప్రచారకులుగా మారి..
    ఏపీలో పాలకులకు ఎదురుతిరిగితే పర్యవసానాలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలియని కావు. గత ఎన్నికల్లో వైసీపీకి ప్రచారకర్తలుగా మారి ప్రచారం చేసిన వారూ ఉన్నారు. వైసీపీని అధికారంలో తెచ్చే వరకూ నిద్రపోలేని వారూ ఉన్నారు. అటువంటి వారు పశ్చాత్తాపంతో బాధపడుతున్నారు. చేసిన తప్పిదాలకు లెంపలేసుకున్నారు. నేను ఉద్యోగిని అని దర్జాగా తిరిగే వారు.. నేనేం ఉద్యోగిని అని నిట్టూర్పు వచ్చేలా పరిస్థితిని ఏరికోరి తెచ్చుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే భరోసా అన్న మాట పక్కకు జరిగి.. పగ, ప్రతీకారం, అణచివేత, ఉక్కుపాదం లాంటి పెద్ద పెద్ద పద ప్రయోగం చేస్తోంది జగన్ సర్కారు. పక్కన దాయాది రాష్ట్రం ఉద్యోగులకు పెద్దపీట వేస్తుండగా.. ఇక్కడ మాత్రం ఉన్న బెన్ఫిట్స్ ను నిలిపివేస్తున్నారు.

    అక్కడ హాయి.. ఇక్కడ కష్టం
    విభజనతో రెండు రాష్ట్రాలు వేరుపడ్డాయి. కానీ తెలంగాణ ఉద్యోగులు ప్రశాంతంగా ఉన్నారు. వేతన ఫలాలను అనుభవిస్తున్నారు. తొలి సారి 43 శాతం ఫిట్ మెంట్… ఆ తర్వాత మరోసారి 30శాతం ఫిట్ మెంట్ అందుకున్నారు. ఎప్పటికప్పుడు డీఏలు ఇస్తున్నారు. ఇటీవల ఉద్యోగాల భర్తీ చేపట్టారు. తాజాగా కాంట్రాక్ట్ ఉద్యోగుల పర్మినెంట్ కార్యక్రమాన్నీ పూర్తి చేశారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆర్థిక సమస్యలు ఉన్నా 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు పీఆర్సీ వేయడమే కాకుండా 17శాతం మధ్యంతర భృతి కూడా ఇచ్చారు. కానీ వైసీపీ సర్కార్ వచ్చిన జీతాన్ని తగ్గించేసింది. డీఏలు ఎగ్గొట్టింది. రకరకాల కారణాలు చెప్పి అసలు జీతం పెరగకుండా చేసింది.  దీంతో ఉద్యోగులు అన్నిరకాలుగా దగాకు గురయ్యారు.

    హామీలన్నీ బుట్టదాఖలు..
    గత ఎన్నికల ముందు జగన్ ఇవ్వని హామీలు లేవు. ముఖ్యంగా వారం రోజుల్లో సీపీఎస్ ను రద్దు చేస్తానని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ దాని గురించి ఇంతవరకూ పట్టించుకోలేదు. కనీసం ప్రకటన కూడా చేయలేదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా తెలంగాణలో సుఖంగానే ఉన్నారు. వారి జతాలకు ఇబ్బంది లేదు. కానీ ఏపీలో వారి జీతాలను ప్రభుత్వం వాడుకుంటోంది. వారికి ఎప్పటికి ఇస్తుందో తెలియడం లేదు.  పోనీ ఉద్యోగుల భవిష్య నిధికి అయినా సేఫ్ ఉందంటే అదీ లేదు. అడ్డగోలుగా వారి ఖాతాల నుంచి నగదును మళ్లిస్తోంది.  ఎలా చూసుకున్న తెలంగాణలో ఉద్యోగి పరిస్థితి ప్రశాంతంగా ఉండగా.. ఏపీలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. రోజురోజుకూ దిగజారుతోంది.