కరోనా మహమ్మారి, లాక్ డౌన్ నిబంధనల వల్ల గతేడాది మార్చి నెల నుండి పాఠశాలలు మూతబడిన సంగతి తెలిసిందే. కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు ఆన్ లైన్ ద్వారా విద్యార్థులకు పాఠాలను బోధిస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ తొమ్మిదో తరగతి, ఆపై తరగతులు చదివే విద్యార్థులకు క్లాసులు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.
కరోనా విజృంభణ నేపథ్యంలో విద్యాశాఖ అన్ని జాగ్రత్తలను తీసుకొని పాఠశాలలను ఓపెన్ చేయనుందని తెలుస్తోంది. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కాలేజీలలో రోజుకు సగం మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇంటర్ విద్యార్థులకు షిఫ్ట్ పద్ధతిలో క్లాసులు జరగనున్నాయి. మరోవైపు మిగిలిన క్లాసుల విద్యార్థులకు సైతం ఫిబ్రవరి 15 నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.
6,7,8 తరగతుల విద్యార్థులకు ఫిబవరి 15 నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు నష్టపోకూడదని అదే సమయంలో విద్యార్థులు కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలను తీసుకోవాలని విద్యాశాఖ భావిస్తోంది. ప్రభుత్వానికి ఇప్పటికే ఈమేరకు ప్రతిపాదనలు అందాయని త్వరలోనే ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశం ఉందని సమాచారం. విద్యాశాఖ ప్రతిపాదనల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.
అయితే 1వ తరగతి నుంచి 5వ తరగతి మధ్య చదివే విద్యార్థులకు మాత్రం తరగతులు ఉండవని తెలుస్తోంది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను డైరెక్ట్ గా ప్రమోట్ చేయనున్నారని సమాచారం. కరోనా ఉధృతి తగ్గడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం విద్యార్థులను పాఠశాలలకు పంపించడానికి సుముఖంగా ఉన్నారు.