తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 3,977 ఉద్యోగ ఖాళీల కోసం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగులను నియమించుకోవడానికి తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఐదు రోజుల క్రితం ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలో 1,460 కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పోస్టులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వం 3,977 పోస్టుల నియామకం కొరకు ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిన నియామకాలను 2022 మార్చి 31 వరకు కొనసాగే విధంగా ప్రభుత్వం ఉత్తర్వ్యులను జారీ చేసింది. స్పెషల్ సెక్రటరీ రొనాల్డ్ రోస్ ఇందుకు సంబంధించి మూడు వేర్వేరు ఉత్తర్వ్యులను జారీ చేయడం గమనార్హం. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ నియామకాలు జరగనున్నాయి. అయితే ఈ పోస్టులు 2022 సంవత్సరం మార్చి 31వ తేదీ వరకు లేదా ప్రస్తుత అవసరాలు తీరే వరకు చెల్లుబాటులో ఉంటాయని సమాచారం.
573 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను, 1,216 మల్టీపర్పస్ హెల్త్‌వర్కర్ (ఫిమేల్) / ఏఎన్‌ఎం పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పోస్టులతో పాటు 766 స్పెషల్ అసిస్టెంట్ సివిల్ సర్జన్, 115 సివిల్ సర్జన్ (జనరల్), 139 ల్యాబ్ టెక్నీషియన్, 119 ఫార్మసిస్టు, 252 ఏఎన్‌ఎం ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీగా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి అర్హతకు తగిన వేతనం లభిస్తుంది. నిరుద్యోగులకు మేలు జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫికేషన్లను విడుదల చేస్తూ ఉండటంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.