https://oktelugu.com/

RTC Jobs: పోలీస్‌ బోర్డు చేతికి.. ఆర్టీసీ ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ!

దశాబ్దాలుగా అంతర్గత ఉద్యోగాల నియామకాలను ఆర్టీసీ సొంతంగా చేపడుతోంది. కానీ, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వ సంస్థల్లో అన్నిరకాల నియామకాలను టీఎస్‌పీఎస్సీ పర్యవేక్షిస్తుండగా, ఆర్టీసీలో ఆ సంస్థ చేపట్టడంపై అభ్యంతరం తెలిపింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 1, 2024 / 08:47 AM IST

    RTC Jobs

    Follow us on

    RTC Jobs: పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు… పోలీసుల నియామకం కోసం ఏర్పాటు చేసిన సంస్థ. హోం గార్డు నుంచి ఎస్సై వరకు అన్ని పోస్టులకూ ఈ బోర్డు నియామక పరీక్షలు నిర్వహిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఈ బోర్డు చేతికి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను ఎంపిక చేసే బాధ్యత అప్పగించింది. సంస్థలో 3 వేల ఖాళీలు భర్తీ చేయాలని సంస్థ ఇటీవలే ప్రతిపాదించింది. ఈమేరకు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదన ఎన్నికల కోడ్‌ ముగిశాక పరిశీలనకు వెళ్తుంది. ఆమోదముద్ర పడగానే ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో రిక్రూట్‌మెంట్‌ బాధ్యతను పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు అప్పగించింది. దీనిపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కానిపక్షంలో ఈ ప్రక్రియ చకచకా ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది.

    టీఎస్‌పీఎస్సీ అనాసక్తితో..
    దశాబ్దాలుగా అంతర్గత ఉద్యోగాల నియామకాలను ఆర్టీసీ సొంతంగా చేపడుతోంది. కానీ, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వ సంస్థల్లో అన్నిరకాల నియామకాలను టీఎస్‌పీఎస్సీ పర్యవేక్షిస్తుండగా, ఆర్టీసీలో ఆ సంస్థ చేపట్టడంపై అభ్యంతరం తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ నియామకాలు లేకపోవడం, తొలిసారి ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో నియామకం ప్రశ్న ఉత్పన్నమైంది. టీఎస్‌పీఎస్సీనే ఉద్యోగాల ఎంపికను పర్యవేక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో మొదట పర్సనల్, ఫైనాన్స్‌ విభాగాల్లో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల నియామక ప్ర‘క్రియ చేపట్టింది. కానీ అప్పట్లో నియామకాలు జరుగలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక నియామక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే డ్రైవర్లు, కండక్టర్ల నియామకంపై టీఎస్‌పీఎస్సీ చేతులు ఎత్తేసింది. ఇతర ఉద్యోగాల భర్తీలో బిజీగా ఉన్నందున ఆర్టీసీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టలేమని తెలిపింది.

    పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు..
    ఈ విషయమై సమాలోచనలు చేసిన ప్రభుత్వం చిరవకు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా నియామకాలు జరపాలని నిర్ణయించింది. ఇంతలో ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో ప్రక్రియ ఆగిపోయింది. ప్రస్తుతం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన నేపథ్యంలో బస్సుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో 8 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లు అవసరమని ఆర్టీసీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. పరిశీలించిన ప్రభుత్వం 3 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఇందులో 2 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లు, వెయ్యి మంది ఇతర విభాగాలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు. సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగానే నియామక ప్రక్రియ ప్రారంభం అవుతుంది.